ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖ పర్యటనలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ మన పార్టీకి కార్యకర్తలే బలం, ఆధారం. ప్రజల కోసమే మనం అధికారంలో కొనసాగుతున్నాము. కనుక శాశ్విత అధికారమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలి. త్వరలోనే నామినేటడ్ పదవులు భర్తీ చేస్తాము కానీ అవి పొందాలంటే మీ సమర్ధత నిరూపించుకోవలసి ఉంటుంది. అసమర్దులకి పదవులు ఇస్తే వారి వలన పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుంది. నియోజక వర్గాల ఇన్-ఛార్జ్ లు, ప్రజా ప్రతినిధులు, మంత్రుల పనితీరుని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ర్యాంకులు ఇస్తున్నాను. వారిలో కొంతమంది వెనుకబడిఉన్నారు. అటువంటి వారు వెంటనే తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. లేకుంటే వాళ్ళ స్థానంలో మరొకరు వస్తారు,” అని అన్నారు.
ప్రజల కోసమే అధికారంలో ఉన్నామని చెప్పినప్పుడు మళ్ళీ శాశ్విత అధికారం గురించి మాట్లాడటం వలన అధికారం కోసం తాపత్రయపడుతున్నారనే భావన కలుగుతుంది. సమర్దులకే పదవులని చెపుతున్నప్పుడు, మంత్రివర్గంలోనే అందరి కంటే తక్కువ ర్యాంకులు వచ్చిన వారిని అసమర్ధులుగానే భావించి తొలగించి వారి స్థానంలో సమర్ధులని నియమించుకోవలసి ఉంటుంది. కానీ అనేక కారణాలు, లెక్కల వలన వారికి ఆ నియమం వర్తింపజేయలేకపోతున్నారు. కానీ పదవులు కావాలంటే సామాన్య కార్యకర్తలు మాత్రం తమ సమర్ధత నిరూపించుకోవలసి ఉంటుందని చెపుతున్నారు.
ఏ పార్టీలో అయినా కార్యకర్తలు జెండాలు మోసేవారిగానే మిగిలిపోతుంటారు. వారిలో ఏ కొద్ది మందికి మాత్రమే చిన్న చిన్న పదవులు లభిస్తుంటాయి. వాటితోనే వారు సంతృప్తి చెందవలసి ఉంటుంది. ఒకప్పుడు తెదేపాలో సామాన్య కార్యకర్తల వలననే చాలా బలంగా ఉండేది. పార్టీలో, ప్రభుత్వంలో పదవులు వారికే దక్కేవి. కనుక పార్టీ పట్ల అందరిలో అంకిత భావం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపి, మంత్రి పదవుల గురించి సామాన్య కార్యకర్తలు కలలో కూడా ఆశించడం కష్టమే. ఎందుకంటే అవన్నీ అంగబలం, అర్ధబలం ఉన్న బడానేతలు, కార్పోరేట్ సంస్థల యజమానులకి మాత్రమే పరిమితం. ఒక్క తెదేపాలోనే కాదు..అన్ని రాజకీయ పార్టీలలోను ఇదే పరిస్థితి.
ఇక మంత్రులకి, ప్రజా ప్రతినిదులకి ర్యాంకులు ఇవ్వడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అది వారి మద్య అంతరం సృష్టిస్తుంది. తక్కువ ర్యాంక్ లు వచ్చినవారు అసమర్ధులుగా పరిగణింపబడతారు కనుక వారిపట్ల అధికారులకి కూడా గౌరవం చూపకపోవచ్చు. ప్రభుత్వంలో అంతమంది అసమర్ధ మంత్రులున్నారని స్వయంగా చాటుకొన్నట్లు అవుతుంది. దాని వలన ప్రతిపక్ష పార్టీలకి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కల్పించినట్లే అవుతుంది. ర్యాంకులు కేటాయించి కొందరిని నిరుత్సాహపరిచే బదులు అటువంటి వారిని గుర్తించి వారి పనితీరు మెరుగుపరుచుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ సహకారాలు అందిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది కదా.