హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలలో మరో ప్రధాన ఘట్టం ఇవాళ ముగిసింది. నామినేషన్ల పర్వం పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ముందే టోకెన్లు తీసుకున్నవారికి సాయంత్రంలోపు దాఖలు చేయటానికి అవకాశం ఉంది. నిన్న మంచిరోజు అయినందున ఒక్కరోజే 1,300 నామినేషన్లు దాఖలవగా, ఆఖరిరోజు కావటంతో ఇవాళ కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. చాలా చోట్ల బీ ఫారంలు లేకుండానే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీ ఈ నెల 18న జరుగుతుంది. ఉపసంహరణకు గడువు 21న ముగిసిన తర్వాత అభ్యర్థులు ఖరారవుతారు. వచ్చే నెల 2న పోలింగ్, 5న కౌంటింగ్ జరుగుతాయి. ఇవాళ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తుది జాబితాలు విడుదల చేశాయి. టీఆర్ఎస్ తుది జాబితాలో సెటిలర్లే ఎక్కువమంది ఉండటం విశేషం. టీఆర్ఎస్కు రెబల్ అభ్యర్థుల బెడద తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 49 మందితో తుది జాబితా విడుదల చేయగా, తెలుగుదేశం పార్టీ నామినేషన్లు దాఖలు చేయటానికి గడువు ముగియటానికి కొద్ది సేపటిముందు – చివరి నిమిషంలో, 81 మందితో జాబితా విడుదల చేసింది. మిగిలిన 6 స్థానాలలో పోటీ తీవ్రంగా ఉండంటవలన వాటికి అభ్యర్థులను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ముందు అసమ్మతివాదులు ఆందోళనకు దిగారు. టీడీపీకి బలమున్న స్థానాలను బీజేపీకి కేటాయించారంటూ మండిపడుతున్నారు. ఇక బీజేపీ అసలు జాబితానే విడుదల చేయకపోవటం మరో విశేషం. తాము పోటీ చేయబోతున్న 63 స్థానాలలో ఒక్కొక్క డివిజన్‌కు ఇద్దరు ముగ్గురితో నామినేషన్లు వేయించారు.