బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. ఉన్న వారిలో కాస్త బలమైన వారు అనుకున్న వారిని ఎంపిక చేస్తే.. వారు ఊగిసలాడుతున్నారు. మొత్తం పదిహేడు స్థానాల్లో హైదరాబాద్ సీటుకు పోటీ పెట్టినా పెట్టకపోయినా ఎవరూ పట్టించుకోరు. మిగిలిన పదహారు స్థానాల్లో అతి కష్టం మీద ముగ్గురు సిట్టింగ్‌లకు చాన్సిచ్చారు. కుటుంబసభ్యుడు లాంటి బోయినపల్లి వినోద్ కుమార్‌కు కరీంనగర్ సీటిచ్చారు. మిగిలిన అభ్యర్థులంతా .. పోటీ ఇస్తారా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి.
సిట్టింగ్ ఎంపీలపైనా రూమర్స్ వస్తూండటం బీఆర్ఎస్ పార్టీని ఆందోళన పరిచేదే. నామా నాగేశ్వరరావు పేరు చాలా కాలంగా జంపింగ్‌ల జాబితాలో తిరుగుతోంది. తాజాగా మహబూబాబాద్ అభ్యర్థి కవిత పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆమె వెంటనే ఖండించారు. కానీ పరిస్థితి చూస్తే.. ఎవర్నీ నమ్మలేని రాజకీయం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో అత్యధికం ఇంత వరకూ ప్రచారం కూడా ప్రారంభించలేదు. పార్టీ క్యాడర్ గందరగోళంలో ఉండటంతో కదలడం లేదు.
కొంత మంది అభ్యర్థులు కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. నామినేషన్ ఉపసంహరించుకోవడమో.. లేకపోతే .. మొక్కుబడిగా పోటీలో ఉండటమో చేస్తారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం వరంగల్ అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ముందు ముందు మరో మూడు , నాలుగు సీట్లకు కొత్త అభ్యర్థుల్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే .. మానసికంగా రెడీ అయిపోతున్నారు. నామినేషన్లు వేయకపోయినా.. వేసిన తర్వాత సైడైపోయినా ఏం చేయాలన్నదానిపై చర్చిస్తున్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్న నియోజకవర్గాలే లేవు. చివరికి మెదక్ విషయంలోనూ గందరగోళంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఆధిక్యత చూపించిన చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ వంటి చోట్ల కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటే ముందు ముందు ఎలాంటి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఊహించడం కష్టమని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.