గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రసాదంపాడులో ఘర్షణ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు వంశీకి నోటీసులు అందించినా డుమ్మా కొట్టారు. గత విచారణలోనే న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. గత విచారణకూ వంశీ హాజరుకాకపోవటంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
వంశీ రెండు నెలలుగా గన్నరవరం నియోజవవర్గనికి రాలేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వంశీ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు ఆయన కుటుంబంపై దారుణమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా మారారు. అయితే ఆయన ఇటీవలి కాలంలో రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేనందున పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ తరపున పోటీ చేయగా.. వైసీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. చాలా స్వల్ప తేడాతో గెలిచిన వంశీ పార్టీ మారిపోవడంతో వెంకట్రావు టీడీపీలో చేరిపోయారు.
ఇప్పుడు ఆయన టీడీపీ తరపున పోటీ చేసేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో వెంకట్రావు నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఎక్కువ మంది వైసీపీ నేతలు ఆయనతో సన్నిహితంగా లేరు. పార్టీ మారినప్పుడు ఆయనతో టీడీపీ నుంచి వెళ్లిన నేతల్లో కూడా కొంత మంది మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు.. ఇలా నియోజకవర్గంలో అనేక రకాలుగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ ఉండటంతో వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.