తెలంగాణా నుంచి ఆంధ్రాలో తెలుగుదేశం నేతలకు ఇంకా బెదిరింపులు ఆగడంలేదు. హైకోర్టు కొట్టేసిన కేసుల్లో కూడా.. వారెంట్లు జారీ చేసేందుకు వెనుకాడటం లేదు. మరోసారి వల్లభనేని వంశీనే టార్గెట్ అయ్యారు. 2008వ సంవత్సరంలో వల్లభనేని వంశీ తనకు ప్రాణ భయం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తిరస్కరించడంతో ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. వారి వద్ద ఆయుధాలు ఉన్నాయంటూ 2009వ సంవత్సరంలో క్రిమినల్ కేసు హైదరాబాద్ లో దాఖలైంది. ఈ కేసులో ఆయన నాలుగో నిందితుడిగా ఉన్నారు. తనపై అక్రమంగా కేసు బనాయించారని, ఆయుధాలతో తనకు సంబంధం లేదని వల్లభనేని వంశీ 2013వ సంవత్సరంలో హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ కేసును పరిశీలించి వంశీ పై ఉన్న కేసును క్వాష్ చేసింది. ఆయన మీద ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ను కూడా రద్దు చేసింది.
ఆ తర్వాత ఈ కేసును ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా తెలంగాణ పోలీసులు ఈ కేసులో వంశీ మూడు నెలలు కోర్టుకు హాజరయి ఆ తరువాత రావడం లేదని పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తనకు రావడంతో వంశీ ఆశ్చర్యపోయారు. హైకోర్టు క్వాష్ చేసిన కేసులో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం వెనుక తెలంగాణా పోలీసుల పాత్ర ఉందన్న వంశీ నేరుగానే ఆరోపించారు. గతంలో వంశీ హైదరాబాద్ లో కొనుగోలు చేసిన పొలానికి సంబంధించి కూడా నామినేషన్ కు ముందు తెలంగాణా అధికారులు కొంతమంది బెదిరింపులకు దిగారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ట్యాంపర్ అయ్యాయంటూ వాటిని నకిలీలుగా గుర్తించామని, వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నామంటూ నోటీసులు ఇచ్చారు. 50 ఎకరాల భూమిలో తెలంగాణా ప్రభుత్వానికి చెందిందంటూ బోర్డు పెట్టారు.
ఈ బోర్డు పెట్టిన అనంతరం వంశీ తెలంగాణా అధికారులను సంప్రదించగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలవాలని సూచించారు. పార్టీ మారి, వైసీపీ కండువా వేసుకోవాలి, లేని పక్షంలో తెలుగుదేశం తరుపున నామినేషన్ వేయకుండా ఉండటం, ఒకవేళ వేసినా సైలెంట్ అవ్వాలని షరతులు విధించారు. ఈ షరతులకు వంశీ లొంగకపోవడంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ను బయటికి తీశారు. ఏపీ విషయంలో తెలంగాణ పోలీసులతోనే… పెత్తనం చేయాలనుకుంటున్న వ్యవహారం.. ఏపీ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.