ఆంధ్రప్రదేశ్ యువతకు బంపర్ ఆఫర్ వచ్చేసింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ప్రయత్నించడం బెటర్. ఎందుకంటే ప్రతీ జనవరిలో ఇస్తామన్న ఉద్యోగ క్యాలెండర్ ఇక రాదు. ఇచ్చినా.. నాలుగైదు పోస్టులే ఉంటాయి. యాభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా… ఒక్కటీ భర్తీ చేయరు. కానీ.. వీరికి ఉపాధి చూపించడానికి మాత్రం సీఎం జగనన్న ఏ మాత్రం అశ్రద్ధ చేయడం లేదు. వాలంటీర్ పోస్టులు.. మటన్ మార్టులు తర్వాత.. ఇప్పుడు మరింత విస్తృత స్థాయిలో కర్రీ పాయింట్ల ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇది కూడా నాన్ వెజ్ కర్రీ పాయింట్లు.
ఫిష్ ఆంధ్రా పేరుతో ఇటీవల సీఎం జగన్ రెడ్డి ఓ స్కీమ్ లాంఛ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు పెట్టుకోవచ్చన్నారు. పులివెందులలో ఓ దుకాణాన్ని తానే ఓపెన్ చేసి.. పులివెందు ప్రజలు ఫ్రెష్షు రొయ్యలు, చేపలు తింటారని కలలో కూడా ఊహించి ఉండరని.. తన భుజాన్ని తాను చరుచుకున్నారు. తరవాత రెండు నెలలకే అది మూతపడిందనుకోండి..అది వేరే విషయం. ఇప్పుడు అలా ఫ్రెష్ఫ్ చేపలు, రొయ్యలు మాత్రమే కాకుండా.. వాటిని కోసి కూర వండి అమ్మే కర్రీ పాయింట్లను పెట్టుకోవాలని పిలుపునిస్తున్నారు. ఇందు కోసం… రుణాలు కూడా ఇప్పిస్తామంటున్నారు.
ఫిష్ ఆంధ్రా స్టాల్స్.. మిగతా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లాగే అట్టర్ ఫ్లాప్ అయింది . ఎక్కడా సక్సెస్ కాలేదు. వాహనాలు లాస్ అయ్యాయి. అయినా సరే సీఎం జగన్ ఇప్పుడు కొత్తగా కోసి కూర వండేందుకు స్టాల్స్ ఏర్పాటు చేయించాలనుకుంటున్నారు. రెనోవేషన్ చేసిన ఈ స్కీమ్‌లో కొత్త పాయింటేమిటంటే… వంట వండటం కూడా నేర్పిస్తారట. ఏపీ యువతకు ఇంత కంటే గొప్ప ఆఫర్ ఇక లభించకపోవచ్చు. ప్రయత్నించండి మరి !