అమరావతికి ఐదేళ్లు పట్టిన గ్రహణం వీడిపోవడంతో కొత్త ప్రభుత్వం గత వైభవానికి ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకంటోంది. అత్యంత ఆకర్షణీయమైన టూరిజంగా కూడా మంచి ప్లస్ అయ్యే డిజైన్లతో ఐకానిక్ భవనాలు పూర్తి చేయనున్నారు. గతంలో డిజైన్లను ఇంగ్లాండ్ చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్చర్ నార్మన్ ఫోస్టర్స్ కంపెనీ డిజైన్ చేసింది. వాటితో పనులు ప్రారంభమయ్యాయి. హైకోర్టుతో పాటు పరిపాలనా టవర్స్, అసెంబ్లీ భవన నిర్మాణాలకు పునాదులు పడ్డాయి.
అయితే వాటి నిర్మాణాలు ఊపందుకోక ముందే ప్రభుత్వం మారింది. అప్పటి నుండి ఎక్కడివక్కడే ఉన్నాయి. అంతేనా … మొత్తం అమరావతితో సంబంధం ఉన్న అందర్నీ వెళ్లగొట్టారు. నార్మన్ ఫోస్టర్స్ తోనూ ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. ఫలితంగా అమరావతిని నిర్వీర్యం చేసినంత పని చేశారు. కొత్త ప్రభుత్వం మళ్లీ అందర్నీ సమీకరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వంతో ఏర్పడిన చేదు అనుభవాలను మర్చిపోయేలా చేసి మళ్లీ కలిసి పని చేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఇందుకు నార్మన్ ఫోస్ట్స్ అంగీకరించింది.
అమరావతికి నిధుల సమస్య దాదాపుగా పరిష్కారం అయింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడమే మిగిలింది. జంగిల్ క్లియరెన్స్ కూడా చివరి దశకు వచ్చింది. ఐదేళ్ల పాటు పెరిగిన పిచ్చి మొక్కలన్నింటినీ కట్ చేశారు. వాటిని అవసరమైన పరిశ్రమలకు తరలించనున్నారు. డిసెంబర్ నుంచి అమరావతిలో 24/7 పనులు జరగనున్నాయి.