తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్న వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అన్నీ మాట్లాడుకుని రెడీ అయినా కింది స్థాయి నేతల వ్యతిరేకతతో కండువా కప్పేందుకు హైకమాండ్ కూడా ఆలోచిస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం, వివాదాస్పదం కాని నేత అయిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ చేరికకే క్యాడర్ అంగీకరించలేదంటే ఇక కేసుల బారిన పడి.. తమను తాము కాపాడుకునేందుకు వచ్చే నేతల్ని సహించే ఆవకాశం ఉండదు. అందుకే టీడీపీలో వైసీపీ నేతల చేరికలు అంత ఈజీగా కనిపించడం లేదు.
అవకాశం వస్తే టీడీపీలో లేకపోతే జనసేన, బీజేపీలో అయినా చేరేందుకు చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. నేరుగా పార్టీ ఆఫీసు నుంచి కాల్ వచ్చినా పట్టించుకోవడంలేదు. జగన్ రెడ్డితో మీటింగ్ అని పిలిచినా పని చూసుకోమంటున్నారు. అయితే వీరికి ఇతర పార్టీల్లో చాన్స్ వస్తుందో రాదో తెలియడం లేదు. అయినా సరే వైసీపీకి దూరంగానే ఉంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరుగుతాయన్న క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే టీడీపీలో చేరికలకు క్యాడర్ కాస్త సానుకూలత ఉండే అవకాశం ఉంది. టీడీపీ హైకమాండ్ కూడా అప్పుడే వారికి సర్దిచెప్పగలదు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎలాంటి నేతల్ని తీసుకున్నా వ్యతిరేకత కనిపిస్తుంది. అందుకే తొందర పాటు వద్దని టీడీపీ హైకమాండ్ కూడా అనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.