కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేస్తున్నదా. నిధులు ఇచ్చే విషయంలో ముష్టి విదిలించినట్లుగా కొద్దికొద్దిగా ఇస్తూ అన్యాయం చేస్తూ ఉన్న మోడీ సర్కారు, కనీసం చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అర్హమైన వాటాలను దక్కించే విషయంలో కూడా కనీసం చొరవ చూపించకుండా.. ఏపీ పట్ల వివక్ష మరియు నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తున్నదా? విభజన చట్టంలో అడ్డగోలుగా నిబంధనలు పెట్టేసి, ప్రాక్టికల్‌గా ఇబ్బందులు ఎదురైన తర్వాత వాటిని సమీక్షిస్తాం అని చెప్పేసి… ఇప్పుడు జరుగుతున్న నష్టం గురించి ఏపీ సర్కారు ఎన్ని సార్లు లేఖలు రాసినా పట్టించుకోకపోవడాన్ని.. కేంద్రం చేస్తున్న ద్రోహం అని గాక మరేం అనాలి! మిత్రపక్షంగా ఉన్నారు గనుక… నేరుగా మోడీ సర్కారు మీద కత్తులు దూయడానికి తెదేపాకు తెగువ ఉన్నట్లు లేదుగానీ.. వాస్తవంగా చూసినప్పుడు.. కేంద్రం ద్వారా ఏపీకి బోలెడు ద్రోహం జరుగుతున్నట్లు అర్థమవుతూనే ఉంది.
వాణిజ్య పన్నుల శాఖకు న్యాయబద్ధంగా దక్కవలసిన పన్నుల్లోని వాటాను పొందడానికి ప్రస్తుతం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏపీ అసలే ఆర్థిక కష్టాల్లో ఉంటే..ఇలాంటి వ్యవహారాల్లో ఒకసారి కోర్టుకు వెళితే.. నిర్ణయం వచ్చేలోగా ఎన్ని సంవత్సరాలు గడచిపోతాయో తెలియదు. అయితే ఇదే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన ఇరు రాష్ట్రాల మధ్య పన్నుల పంపకాన్ని చక్కబెట్టవలసిన బాధ్యత ఉన్న కేంద్రం మాత్రం పట్టించుకోకుండా మోసం చేస్తున్నదని చెప్పాలి.
విభజనచట్టం 50, 51, 56 సెక్షన్ల ప్రకారం పన్ను బకాయిల విషయంలో వ్యాపారాలు తాము నమోదు చేసుకున్న రాష్ట్రానికి మాత్రమే చెల్లిస్తారు. అదే వారికి తిరిగి చెల్లించాల్సి వస్తే.. ఇరు రాష్ట్రాలు కలిసి జనాభా నిష్పత్తిలో చెల్లించాలి. అంటే వ్యాపారాలు హైదరాబాదులో ఉంటే వారు కట్టే పన్నులు తెలంగాణకు కడతారు. వారికి ప్రభుత్వం బకాయి ఉంటే 58 శాతం ఏపీ భరించాలి. ఇలా ఉన్నది ప్రస్తుత నిబంధన. ఇలాంటి వంకర విధానం వల్ల ఏపీకి సుమారు 3800 కోట్ల నష్టం వస్తున్నదంటూ ఏపీ తరఫున కేంద్రహోంశాఖకు పలుమార్లు లేఖలు రాశారు. ప్రయోజనం లేదు. చిట్టచివరి ప్రయత్నంగా కోర్టుకు వెళ్లడానికి ఏపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.