కేంద్రంలో మళ్లీ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో దేశంలో ప్రాంతీయ పార్టీల అస్తిత్వం, బీజేపీయేతర ప్రభుత్వాల మనుగడపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలపై నజర్ పెట్టిన బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారం చేపడితే ప్రాంతీయ పార్టీల పునాదులను పెకిలించకుండా ఉంటుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ ఎదుగుదల ఆశించిన మేర లేదని బీజేపీ అధినాయకత్వం ఎప్పుడో గుర్తించింది. అందుకే ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని కనుమరుగు చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమిళనాడులో ఆ దిశగా ఆపరేషన్ షురూ చేసిన బీజేపీ, తెలంగాణలోనూ ఆపరేషన్ బీఆర్ఎస్ చేపట్టాలని ఫిక్స్ అయినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్లేసును ఆక్యుపై చేసుకొని కాంగ్రెస్ కు ప్రత్యామ్నయంగా నిలవాలని బీజేపీ నేతలు పట్టుదలతో ఉన్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ నేతలు అప్పుడే హింట్ కూడా ఇచ్చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి కనుమరుగు కాబోతుందని, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే తరహాలో రాజకీయం కొనసాగనుందని స్పష్టం చేస్తున్నారు.
బీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ ఆపరేషన్ చేపడితే భవిష్యత్ లో కాంగ్రెస్ సర్కార్ కు కూడా ఇబ్బందులు రావొచ్చునని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పార్టీలో లుకలుకలను ఆధారం చేసుకొని తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే విషయంలో బీజేపీ మరోసారి తన వర్క్ స్టైల్ ను ప్రదర్శించవచ్చునని అభిప్రాయపడుతున్నారు.
దీంతో ఎన్నికల ఫలితాల ఆధారంగా వ్యూహాలను అమలు చేసేందుకు బీజేపీ తెలంగాణను ఓ ప్రయోగశాలగా మలుచుకోనుందనే ప్రచారం జరుగుతోంది.