వైసీపీ ఇప్పుడు రెండు అవిశ్వాస తీర్మానాలతో భంగపడిన దశలో ఉంది. నిజానికి ఈ రెండు ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయనే నమ్మకంతో చేసిన ప్రయత్నాలు కానే కాదు. అయితే మొగుడు కొట్టినందుకు కాదు గానీ తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిన ఇల్లాలి చందంగా ఆ పార్టీ పరిస్థితి ఉన్నది. తీర్మానాలు ఓడిపోవడం ఒక ఎత్తు. తమ పార్టీ గుర్తు మీద గెలిచిన 8 మంది ఎమ్మెల్యే లు సభకు డుమ్మా కొట్టడం ఒక ఎత్తుగా వారి ఆవేదన ఉంటేె అందులో ఆశ్చర్యం లేదు. వైసీపీ ని వీడి టీడీపీ లో చేరిన 8 మంది ఈ తీర్మానాలు మీద జరిగిన ఓటింగ్ కు మాత్రమే కాదు… ఏకంగా సభకే డుమ్మా కొట్టి తప్పించుకున్నారు. అందుకే జగన్ వారి మీద ఉక్రోషంతో ఉడికిపోతూ ఉండడం చాలా సహజం.
నిజానికి వైసీపీ కి చెందినా 9 మంది ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొట్టారు. వీరిలో నెల్లూరు కు చెందినా అనిల్ కుమార్ ముందే సమాచారం ఇచ్చి అనారోగ్యం వాళ్ళ రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోజా ఎటూ సస్పెన్షన్ లొనే ఉన్నారు. ఇక ఫిరాయించిన 8 మంది మిగిలారు. అయితే తాము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి విప్ కూడా జారీ చేస్తే.. డుమ్మా కొట్టిన వారిపై వేటు వేయించాలని పార్టీ ఇప్పుడు కసరత్తు చేస్తున్నది. వారు విప్ ధిక్కరించారంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలనీ వారు అనుకుంటున్నారు. అయితే ఈ ఫిర్యాదు ద్వారా వారు అనుకుంటున్నట్లుగా ఆ 8 మందిపై వేటు వేయించడం అంత వీజీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
8 మంది పార్టీ మరినందున వేటు వేయలంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇప్పటికే స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఏమైనా చర్య తీసుకోవడం అంటూ జరిగితే దాని ఆధారంగా తీసుకోగలరే తప్ప… ఇవాళ డుమ్మా కొట్టడం వలన చర్య తీసుకోలేరని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఆ 8 మంది ఇవాళ సభకే రాలేదు. నిన్న కూడా రాలేదు. వైసీపీ అవిశ్వాసం నోటీసు ఇచ్చిన సంగతే తమకు తెలియదని, విప్ సంగతి కూడా తెలియదని వారు తప్పించుకోవడానికి మెండుగా అవకాశం ఉంది. రెండు రోజులుగా వారు సభకే రానందువలన వారికీ విప్ అందజేసినట్లుగా వైసీపీ నిరూపించుకోవడం కూడా కష్టం. ఆ కోణం లోంచి చూసినప్పుడు… ఆ 8 మందిపై జగన్ ఆసిస్తున్నట్లుగా వేటు వేయించడం అంత వీజీ కాదని అంతా అనుకుంటున్నారు.