NOTA Sameeksha
తెలుగు రేటింగ్: 2.25/5
సినిమా – క్రికెట్ – రాజకీయం
ఈ మూడింటిలో దేని గురించి సినిమా తీసినా క్లిక్ అవుతుంది. ఎందుకంటే… ఈ మూడింటికి మించిన ఎంటర్టైన్మెంట్ భారతీయులకు లేనేలేదు.
పొలిటికల్ డ్రామా – ఓ నికార్సయిన కమర్షియల్ ఎలిమెంట్. ఓటు గురించి, సీటు గురించి ఎన్నిసార్లు చెప్పినా కిక్ ఉంటుంది. ఎందుకంటే అవి నిరంతరం చూస్తున్న విషయాలే. అందుకే పొలిటికల్ డ్రామాలు కూడా ఓ ఫార్ములాలా మారిపోయాయి.
ఒకే ఒక్కడు
లీడర్
భరత్ అనే నేను
ఇవి నూటికి నూరు పాళ్లూ రాజకీయ చిత్రాలే. వాటిలో రాజకీయం ఉంటుంది. ఆ మాటకొస్తే రాజకీయం మాత్రమే ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇవి ‘యువ ముఖ్యంత్రుల’ కథలు. అలాంటి మరో కథ `నోటా`.
అటు పొలిటికల్ డ్రామా – ఇటు విజయ్ దేవరకొండ సినిమా – ఇంతకంటే ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఏం కావాలి? అందుకే అందరి నోటా.. `నోటా` ఓ మాటలా చేరిపోయింది. ‘నోటా’లో ముఖ్యమంత్రిగా విజయ్ దేవరకొండ ఏం చేసుంటాడు? ఈ సినిమాలో రాజకీయాల గురించి ఏం చెప్పి ఉంటారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి `నోటా`వాళ్లందరి అంచనాల్నీ అందుకుందా? విజయ్ దేవరకొండ ఖాతాలో మరో విజయం జమ అయ్యిందా?
కథ
ఓ ముఖ్యమంత్రికి అవినీతి కేసులో తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తదుపరి ముఖ్యమంత్రిగా తన కుమారుడ్ని నియమిస్తాడు. యువ ముఖ్యమంత్రికి రాజకీయాల గురించి బొత్తిగా తెలీదు. నాన్న కేసు నుంచి విముక్తి అయ్యేంత వరకే కదా అనుకుంటే…ఆ పదవే తన మెడకు గుదిబండలా చుట్టుకుంటుంది. ఆ పదవే రాజకీయాలు నేర్పిస్తుంది. ఆ పదవే.. తండ్రిని సైతం ఆసుపత్రిలో బంధించేలా చేస్తుంది. ఇంతకీ ఇదంతా ఎందుకు? రాజకీయ చరదంగంలో ఓ యువ ముఖ్యమంత్రి ఆడిన ఆట ఏమిటి? అతన్ని దింపడానికి ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఏమిటి? ఇదే `నోటా` కథ.
విశ్లేషణ
జీవితాన్ని సరదాగా గడిపేసే ఓ కుర్రాడు, అసలు రాజకీయాలకు సంబంధం లేని ఓ యువకుడు – అనుకోకుండా సీఎం అవుతాడు.. `ఒకే ఒక్కడు`కి ముందు వరకూ ఇదో కొత్త పాయింట్. అదే పాయింట్‌తో `లీడర్`, `భరత్ అనే నేను` వచ్చాయి. కాబట్టి `నోటా` కోసం దర్శకుడు అనుకున్న పాయింట్ ఏమీ కొత్త కాదు. సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. రాజకీయాలకూ అంతే. ప్రతిపక్షం బలంగా ఉండాలి. కానీ.. `నోటా`లో స్వపక్షమే ప్రతిపక్షంగా మారుతుంది. ప్రతిపక్షం అనే మాటకే ఈ సినిమాలో చోటు లేదు. అది ఈ కథలో ప్రధానమైన లోపం.రాజకీయాల పట్ల ప్రజలకు కొంత అవగాహన కొండంత ఆశలూ ఉంటాయి. `ఇలాంటి సీఎమ్ ఉంటే బాగుణ్ణు` అనుకుంటుంటారు. కనీసం తెరపైనైనా తమ కలల ముఖ్యమంత్రిని చూసుకోవాలనుకుంటారు. కానీ `నోటా` దానికీ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ పాత్రని తీర్చిదిద్దడంలో ఉన్న లోపమో, కథలోని వైపరిత్యమో తెలీదు గానీ… తొలి సగం వరకూ ముఖ్యమంత్రి నిజంగానే `డమ్మీ`గా ఉండిపోవాల్సివస్తుంది. `మూడు రోజుల పాటు మా పార్టీ కార్యకర్తలెవరూ బయట తిరక్కూడదు` అనే ప్రెస్ మీట్ సీన్లోనే కాస్త ఉత్సాహం ఉద్వేగం వస్తుంది. దానికి ముందూ వెనుకా.. `నోటా`లో జోరు కనిపించదు. ఇది పూర్తిగా తమిళ రాజకీయాలకు సంబంధించిన కథ. అక్కడి పరిస్థితులు తెలిసిన వాళ్లకు ఈ కథ ద్వారా దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడో అర్థమవుతుంది. లేదంటే… ఓ ఫక్తు రాజకీయ డ్రామాలా అనిపిస్తుంటుంది. రిసార్ట్ రాజకీయాలు, ఆసుపత్రిలో వ్యవహారాలు ఇవన్నీ జయలలిత ఎపిసోడ్‌ని గుర్తు తెస్తాయి. తమిళ ప్రేక్షకులకు ఇవన్నీ కిక్ ఇవ్వొచ్చు గాక.. తెలుగు వాళ్లకు మాత్రం అచ్చమైన అరవ డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ తీసుకొస్తుంది.
`రౌడీ సీఎమ్` అనేది ఈ ముఖ్యమంత్రికి ఉన్న ట్యాగ్ లైన్. నిజంగా దానికైనా విలువ ఇస్తూ ముఖ్యమంత్రి చేసిన రౌడీ పనుల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏం మంచి జరిగింది? అనేది చూపిస్తే.. ఓ కొత్త ముఖ్యమంత్రిని తెరపై చూశామన్న భావన కలిగేది. దాన్ని వదిలేసి అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టాడు దర్శకుడు. ఇంట్రవెల్ తరవాత సుదీర్ఘంగా సాగిన వరదల ఎపిసోడ్ లో దర్శకుడి బ్రిలియన్స్ ఏమాత్రం బయటపడలేదు. ఆ సీన్ చాలా సాదా సీదాగా ఉంది. నాజర్ లవ్ ట్రాక్, సత్యరాజ్ ఎపిసోడ్ మరీ సుదీర్ఘంగా సాగుతాయి. వాటిని చూస్తున్నప్పుడే క్లైమాక్స్ ఏమిటన్నది ప్రేక్షకుడికి చూచాయిగా అర్థమైపోతుంటుంది. కాబట్టి పతాక సన్నివేశాల్లో ఇచ్చిన ట్విస్టు కూడా ప్రేక్షకులకు ఎలాంటి కిక్కూ ఇవ్వదు. లవ్, రొమాన్స్, ఎంటర్టైన్ మెంట్స్‌కి `నోటా` ఆమడ దూరం ఉంటుంది. సీరియస్ సబ్జెక్ట్‌లో కామెడీకి, రొమాన్స్కీ అవకాశం ఉండకపోవొచ్చు.కానీ మరీ ఇంత `రా`గా కూడా ఉండకూడదు. మనం ముందే ఉదహరించుకున్న `ఒకే ఒక్కడు`లోగానీ, `భరత్ అనే నేను`లోగానీ కమర్షియాలిటీని ఎంత అందంగా మౌల్డ్ చేశారు దర్శకులు..? ఆ లోపం ఈ సినిమాలో స్పష్టంగా కనిపించింది. స్వామీజీల గురించి ఏదో బలమైన సెటైర్ వేశాడనుకుంటే.. దాన్ని కూడా పైపైనే టచ్ చేసి వదిలేశారు. పనామాలో ప్రియదర్శిన్ చేసే ఆపరేషన్ కూడా… ఆషామాషీగానే సాగింది. పది వేల కోట్ల వ్యవహారం… ఓ హ్యాకర్‌కి అప్పగించడం, మర్డర్ కేసులో ఏ1గా ఉన్న ముఖ్యమంత్రి కనిపించకుండా మాయమవ్వడం… ఇవన్నీ లాజిక్ కి అందని విషయాలు.
నటీనటులు
విజయ్ దేవరకొండ ఇప్పుడో స్టార్. తన ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో పాటు అంచనాలు కూడా. వాటిని ఏమాత్రం అందుకోలేని పాత్ర ఇది. `డమ్మీ సీఎమ్`లానే దేవరకొండ పాత్ర కూడా చాలాసార్లు డమ్మీగా ఉండిపోవాల్సివస్తుంది. పులిని ఓ బోనులో వేసి బంధిస్తే.. దాని వేట చూడలేం. ఈ సినిమాలో విజయ్ పాత్ర కూడా అంతే. సీఎమ్ ఓ రూమ్‌లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ.. సంతకాలు చేస్తుంటాడు. విజయ్ పాత్రనీ అలానే బంధించేశారు. విజయ్ తాలుకూ ఇంటెన్సిటీని ఎక్కడా చూసే అవకాశం రాలేదు. ఆఖరికి లిప్‌లాక్ సీన్లో సైతం. మెహరీన్ కథానాయిక అనేకంటే…. ఓ సహాయక పాత్ర పోషించింది అని చెప్పాలి. మెహరీన్ కంటే చెల్లాయి పాత్ర పోషించిన చిన్న అమ్మాయికే డైలాగులు ఎక్కువ ఉన్నాయి. నాజర్, సత్యరాజ్ వీళ్లు అపర సీనియర్లు. తమ సీనియారిటీ ఉపయోగించి తమ పాత్రల్ని నిలబెట్టడానికి ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ చివరి సన్నివేశాల్లో నాజర్ని కూడా చూడలేం. ఆ పాత్ర రూపాన్ని అంత భయంకరంగా మార్చేశారు.
సాంకేతిక వర్గం
ఇది తెలుగు, తమిళ చిత్రం అని చెబుతున్నా.. చూడ్డానికి మాత్రం అరవ డబ్బింగ్ సినిమాలా ఉంది. తమిళంలో పాటలకూ, మాటలకూ చాలా చోట్ల లిప్ సింక్ కూడా కుదర్లేదు. తొలి పాట అస్సలు అర్థమే కాలేదు. ఓ పొలిటికల్ డ్రామాని ఇంత పేలవంగా తీర్చిదిద్దిన చిత్రం ఈ మధ్యకాలంలో ఇదేనేమో. దీనికంటే.. ఈమధ్య వచ్చి ఫ్లాప్ అయిన.. `శకుని`లోనే ఎక్కువ డ్రామా, ఎక్కువ మలుపులు కనిపిస్తాయి. అక్కడక్కడ కొన్ని పొలిటికల్ పంచ్‌లు పేలాయి. లుంగీ గట్టిగా కట్టుకోండి – లేదంటే లాగేస్తారు, కాళ్లే కాదు అప్పుడప్పుడూ మొహం కూడా చూడండి, లేదంటే సరిగా చూడలేదంటూ శిలావిగ్రహాలు తప్పుగా చెక్కుతారు.. లాంటి డైలాగులు పొలిటికల్ సైటర్లు. పాటలకు స్కోప్ లేని ఈ సినిమాలో నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది.
తీర్పు
పతాక సన్నివేశాల్లో `మూసీని క్లీన్ చేద్దాం. ఎన్నికలకు ఒక రోజు ముందు నేను బోట్లో మూసీ నదిలో షికారు చేయాలి` అంటాడు సీఎమ్. మూసీ నదిలో షికారు చేస్తే.. సీఎమ్ అయిపోవొచ్చు అనేది ఎంత పొలిటికల్ బ్లండరో – ఇలాంటి బలహీనమైన కథతో పొలిటికల్ డ్రామాని తెరకెక్కించాలనుకోవడం కూడా అంతే బ్లండర్. అక్కడక్కడ కొన్ని మెరుపులు, కొన్ని సెటైర్లు తప్ప – పెద్దగా ఆకట్టుకోని ప్రయత్నం – నోటా.
ఫైనల్ టచ్: డిపాజిట్లు గల్లంతు
తెలుగు రేటింగ్: 2.25/5