ప్రముఖ రచయిత్రి, తెలుగు విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్సిలర్ నాయిని కృష్ణ కుమారి నిన్న రాత్రి మరణించారు. ఆమె గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించారు.
ఆమె మార్చి14,1930న గుంటూరులో జన్మించారు.ఆమె ప్రముఖ లాయర్ కనకపల్లి మధుసూదన రావుగారి ఆర్ధాంగి. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.
ఆమె 1951లో మద్రాస్ విమెన్స్ కాలేజీలో లెక్చరర్ గా తన అధ్యాపక జీవితం ప్రారంభించారు. మరుసటి సంవత్సరమే ఆమె ఉస్మానియా యూనివర్సిటీలోని విమెన్స్ కాలేజీకి వచ్చేసారు. అక్కడే ఆమె చాలా కాలం వరకు ప్రొఫెస్సర్ గా పనిచేసారు. 1983-84 సం.లలో ఆమె తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీకి ప్రిన్సిపుల్ గా పనిచేసారు. మళ్ళీ ఉస్మానియాకి తిరిగి వచ్చి తెలుగు విభాగానికి అధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ కి అధ్యక్షురాలిగా పనిచేసి 1990 సం.లో పదవీ విరమణ చేసారు. తరువాత 1996 నుండి 99 వరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ గా పనిచేసారు.
కనుమరుగవుతున్న తెలుగు జానపద సాహిత్యాన్ని నాయిని కృష్ణ కుమారి వెలుగులోకి తెచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సమయంలోనే ఆమె ‘తెలుగు జానపద విజ్ఞానం: సమాజం, సంస్కృతి, సాహిత్యం’ అనే ఒక అద్భుతమయిన గ్రంధాన్ని రచించారు. జానపద సాహిత్యానికి సంబంధించినంత వరకు అదొక డిక్షనరీ అని చెప్పవచ్చును. ఆమె గణితశాస్త్రంలో కూడా అపూర్వమయిన ప్రతిభ కనబరిచారు. అగ్నిపుత్రి, ఏం చెప్పం నేస్తం, గౌతమి, అపరాజిత నవలలు, ఆయత కధల సంపుటి, ఆంధ్రుల కధ, మనమూ మన పూర్వులు, తెలుగు బాష చరిత్ర, తెలుగు జానపద గేయ గాధలు, పరిశీలన, పరిశోధన, కాశ్మీర దీపకళిక వంటి చారిత్రిక, బాష, పరిశోధన, పర్యాటక గ్రంధాలు ఆమె ప్రతిభకు అద్దం పడతాయి.