విభజన సమస్యల పరిష్కరం కోసం ఏపీ, తెలంగాణ సీఎంలు ఆరో తేదీన సమావేశం అవుతున్నారు. ఇందుకు ప్రజాభవన్ వేదిక అవుతుంది. జగన్,కేసీఆర్ కాంబో అధికారంలో ఉన్నప్పుడు సమావేశాలు వ్యక్తిగతంగా జరిగాయి. అసలేం చర్చించారో ఎవరికీ తెలియదు. విభజన సమస్యలపై అసలు చర్చించినట్లుగా ప్రభుత్వాలు కూడా చెప్పలేదు. జగన్ గెలవగానే ఏపీకి చెందిన సెక్రటేరియట్ భవనాలు ఇచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇటీవల రేవంత్ సీఎం అయిన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు మళ్లీ తెలుగురాష్ట్రాల సీఎంలు భేటీ అవుతున్నారు.
ఒక్క భేటీతో పరిష్కారమయ్యే చిన్న సమస్యలు కాదు !
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నవి ఒక్క భేటీతో పరిష్కారమయ్యే సమస్యలు కాదు. గతంలో రాజ్ భవన్ కేంద్రంగా నరసింహన్ మధ్యవర్తిత్వంతో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగినా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎందుకంటే ఉమ్మడి ఆస్తులన్నీ తమవేనని తెలంగాణ వాదించింది. ఉన్నత విద్యామండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు.. షిలాభిడే కమిటీ సిఫార్సుల మేరకు పంపకాలకు తెలంగాణ అంగీకరించలేదు. ఫలితంగా ఎప్పటికప్పుడు పీటముడిపడిపోయింది. ఇప్పుడు ఒక్క భేటీతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదు.
పరిష్కరించుకున్నా రాజకీయం చేయనున్న విపక్షాలు !
విభజన సమస్యలకు పరిష్కారం అసలు సమస్య కాదు. అసలు సమస్య విపక్షాలు చేసే రాజకీయం. ఏ ఒప్పందం చేసుకున్నా రాష్ట్రాన్ని తాకట్టుపెట్టేశారని బీఆర్ఎస్.. మన ఆస్తులు తెలంగాణకు ఇచ్చేశారని ఏపీలో వైసీపీ నేతలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే కథలు చెప్పడం ప్రారంభించింది. పరిశ్రమలను తెలంగాణకు పంపడానికే సీఎంల భేటీ అని.. సోషల్ మీడియాలో ఆరోపణలు ప్రారంభించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం పరిష్కరించే ప్రయత్నం చేయలేదు.కానీ ఇప్పుడు మాత్రం పరిష్కారానికి ప్రయత్నిస్తే ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
మరి కొన్ని భేటీల తర్వాతైనా ముగింపు పలకాలి !
తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోదగిన సమస్యలు ఉన్నాయి. నీటి సమస్యను ట్రైబ్యునల్ పరిష్కరిస్తుంది. నీటి సమస్యలు అంత తేలికగా పరిష్కారమవ్వవు. కేసీఆర్ విజయవాడలో బేసిన్లు లేవు.. బేషజాలు లేవంటూ భారీ ప్రకటన చేసి.. మళ్లీ కృష్ణా జలాలపై పెద్ద రచ్చే చేశారు. ఇలాంటి విధానాలతో కాకుండా… విభజన చట్టంలో కాల పరిమితి తీరిపోయిన అంశాలపైనా సమగ్రంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుంది.