అమిత్ షా.. ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నాడంటే.. ఆప్టిమిస్టిక్ గా ఉండే ప్రజలు కొత్త ఆశలు పెట్టుకున్నారు. గతంలో విజయవాడకు వచ్చిన నితిన్ గడ్కరీ ప్రకటించినట్లుగా అమిత్ షా కూడా బోలెడు కొత్త వరాలు గుప్పిస్తారేమో అని ఆశించారు. వారు అలా ఆశించడంలో తప్పేమీ లేదు. పైగా ఆయన నుంచి కొత్త హామీలు మన రాష్ట్రం మీద ప్రేమతో కాకపోయినప్పటికీ.. దక్షిణాదిలో ఒక పెద్ద రాష్ట్రం గనుక.. ఇక్కడ బలపడడం కోసం వారు కాస్త శ్రద్ధ కేంద్రీకరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అమిత్ సభ సాంతం చప్పగానే సాగిపోయింది. ఆయన ప్రకటించిన కొత్త విషయాలు లేవు. పైగా కాసిని అబద్ధాలను కూడా వండి వార్చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన వాటిలో ఇప్పటికే పాతబడి, పాచిపోయిన సంగతులను మళ్లీ ఏకరవు పెట్టి.. చాలా చేసేస్తున్నాం.. అయినా ఏమీ చేయలేదనడం సరికాదు.. అంటూ ముక్తాయించడం అమిత్ షా కే చెల్లింది.
అమిత్ షా ఏపీకి వస్తున్నాడంటే.. ఇక్కడి నాయకులు చాలా సహజంగా ఎక్కువ హడావిడి చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ బలపడడానికి ఈ సభ పునాది అవుతుందని అంతా అనుకున్నారు. అయితే అమిత్ మాత్రం.. తాము ఇచ్చిన 1.93 లక్షల ఇళ్లు, రెండు స్మార్ట్ సిటీలు, నెల్లూరు ను కామధేను పథకం కింద ఎంపిక చేయడం వంటి పాచిపోయిన విషయాలను ఏకరవు పెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో రోడ్లకు 65 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని, అలాగే మొత్తం 1.40 లక్షల విలువైన పథకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకున్నారు. ఏపీలో 24 గంటల విద్యుత్తు సరఫరాకు కూడా కట్టుబడి ఉన్నదని ఆయన చెప్పుకున్నారు. కాగా అమిత్ షా ప్రకటించిన వాటిలో ఏదీ నిలకడగా కొత్తగా కనిపిస్తున్నది లేదు. ప్రజల ఆశల గురించి మాత్రం భాజపా జాతీయ అధ్యక్షుడు ఏమాత్రం పట్టించుకోలేదన్నది స్పష్టం.
అదే సమయంలో బోలెడు అబద్ధాలను కూడా ఆయన ప్రజల ముందు పెట్టడానికి వెనుకాడకపోవడం విశేషం. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తామే ఇచ్చామంటూ ఆయన వెల్లడించారు. నిజానికి పోలవరానికి జాతీయ హోదా అనేది యూపీఏ సర్కారు ప్రసాదించినదే అని చెప్పుకోవాలి. అదే సమయంలో పోలవరం నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పిన అమిత్ షా అది ఏరకంగా చేస్తారో మాత్రం వెల్లడించలేదు. గత ఏడాది వంద, ఈ ఏడాది బడ్జెట్లో వంద కోట్ల వంతున ముష్టి విదిలించినట్లుగా విదిల్చిన కేంద్రం పోలవరం నిర్మాణానికి పూర్తిగా సహకరించడం అంటే ఇదేనా? అని జనానికి ఆగ్రహం వెల్లువెత్తిన మాట వాస్తవం.
అయితే తెలుగు360 డాట్ కాం ముందే అందించిన కథనం మేరకు.. తెలుగుదేశం మీద పెద్దగా విమర్శలు ఏవీ ఈ సభలో వినిపించకపోవడం విశేషం. అమిత్ షా వంటి పెద్ద నేతలు ఎటూ అనరు.. కాకపోతే.. తెదేపాను చికాకు పెడుతున్న ఏపీలోని ఇతర భాజపా నేతలు కూడా ఈ వేదిక మీద పెద్దగా విమర్శలజోలికి వెళ్లకుండానే సభ ముగియడం విశేషం.