తెలంగాణలో మరో టీడీపీ ఎమ్మెల్యే క్రిమినల్ కేసును ఎదుర్కోబోతున్నారా? గ్యాంగ్ స్టర్ నయీం దందాల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యకు పోలీసులు నోటీస్ సర్వ్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని గంటసేపు ప్రశ్నించారు. నయీం గ్యాంగ్ చేసిన హత్యలు, ఇతర దందాలకు సంబంధించి ఆయన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగానే తనను పోలీసులు ప్రశ్నించారని పోలీస్ విచారణ తర్వాత కృష్ణయ్య మీడియాతో చెప్పారు. తనకు నయీంతో సంబంధాలు లేవన్నారు.
అయితే కొన్ని పరిణామాలను బట్టి ఆయన చిక్కుల్లో పడే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి ఉద్యమ కాలంలో లో తనకు నయీం పరిచయం ఉందని ఇటీవల ఆర్ కృష్ణయ్య మీడియాతో చెప్పారు. కొందరిని నయీం వేధిస్తున్న విషయం తన దృష్టికి రావడంతో అలా చేయవద్దని నయీంకు ఫోన్ చేసి మందలించానని కూడా చెప్పారని, అంటే నయీంతో టచ్ లో ఉన్నట్టు కదా అంటున్నాయి పోలీస్ వర్గాలు.
ఇప్పటికే తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్నారు. ఎం ఎల్ సికి లంచం ఇచ్చిన కేసులో జైలుకు కూడా వెళ్లారు. బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య మెడకు నయీం కేసు చుట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే టీ-టీడీపీకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు.
నయీంతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో రాజకీయ నాయకులు, పోలీస్ సహా వివిధ శాఖల అధికారులు ఉన్నారు. వారందరూ విచారణ ఎదుర్కోక తప్పదంటున్నారు పోలీసులు. అయితే సిట్ వ్యవహార శైలిపైనా విమర్శలు వస్తున్నాయి. సిట్ చీఫ్ పైనా విపక్షాలు ఆరోపణలు చేశాయి. సిట్ విశ్వసనీయతను ప్రశ్నించాయి. సిట్ నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని, కేసును సీబీఐకి అప్పగించాలని కూడా కొందరు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు.