వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు కూడా ముహుర్తం ఖరారైనట్లుగా కనిపిస్తోంది. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు పులివెందులలోనే అవినాష్ రెడ్డి ఇంటికి ఆదివారం ఉదయం వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి లేరు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. దీంతో ఆయననే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అవినాష్ రెడ్డి ఉంటే ఆయననూ అరెస్టు చేసేవారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో హైదరాబాద్‌లో ఉన్నారేమోనని అక్కడకూ సీబీఐ బృందాలు వెళ్లాయి కానీ.. అక్కడ కూడా లేకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అసలు అవినాష్ రెడ్డి సమాచారం లేకపోవడంతో ఆజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం ఊపందుకుంది. ఆ సమయంలో అవినాష్ రెడ్డి పులివెందులలోనే మీడియా ముందుకు వచ్చారు. అదీ కూడా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం పెట్టి సీబీఐపై ఆరోపణలు చేశారు. పాత కథలే చెప్పారు. సాయంత్రానికి ఆయనకు సీబీఐ నుంచి నోటీసులు అందాయి. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. గతంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఉపసంహరించుకున్నారు అవినాష్ రెడ్డి. దీంతో అరెస్ట్ నుంచి ఎలాంటి రక్షణ లేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
నెలాఖరులోపు .. దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ హామీ ఇచ్చింది. ఆ ప్రకారం నిందితులందర్నీ అరెస్ట్ చేసి.. సూత్రధారుల గురించి మొత్తం బయటకు తీసి.. కేసు విచారణను సీబీఐ ముగించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి ని… తర్వాత అరెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకుని కేసుకు ఓ తార్కిక ముగింపు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.