ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో హైదరాబాద్ వచ్చి రెండు సార్లు కవితను ప్రశ్నించింది సీబీఐ. రెండో సారి ప్రశ్నించినప్పుడు మరోసారి పిలుస్తామని చెప్పి వెళ్లింది. ఇది జరిగి నెలలు దాటిపోయింది. మధ్యలో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బాగా వెనకేశారని.. ఆస్తులు సంపాదించారని.. కొన్ని వివరాలతో చార్జిషీట్ వేశారు. మళ్లీ పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు.
ఈడీ కేసులు వేరు.. సీబీఐ కేసులు వేరు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ వేరుగా విచారణ జరుపుతోంది. ఆ విచారణను తనను పిలవొద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. నెలల తరబడి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. కవిత రిలాక్స్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు సీబీఐ నోటీసులు ఇచ్చింది. సౌత్ లాబీ నుంచి దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు కవిత తప్ప. అలా అప్రూవర్ అయిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కవితకు నోటీసులు ఇచ్చారు.
అయితే కవితకు నోటీసులు వెనుక అసలు టార్గెట్ కేజ్రీవాల్ అని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సీబీఐ కేసు నమోదు చేసింది… మనీ లాండరింగ్ మీద..డబ్బు లావాదేవీల మీద కాదు. స్కామ్ పాలసీలో మార్పు.. క్విడ్ ప్రో కో వంటి అంశాల మీద. ఇందులో మాగుంట రాఘవరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. కేజ్రీవాల్ కు, ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బు అందేలా చేశామని ఆయన అంటున్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర కీలకం కాబట్టి ఆమెను విచారణకు పిలుస్తున్నారు. కానీ కవితను గట్టిగా ఫ్రేమ్ చేసే అవకాశాలు లేవని.. కేజ్రీవాల్ ను మాత్రమే టార్గెట్ చేస్తారని అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో కేజ్రీవాల్ ను సీబీఐ విచారించింది. ఈడీ విచారణకు మాత్రం కేజ్రీవాల్ హాజరు కావడం లేదు. కవిత విచారణ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.