సంగం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సిందేనన్న పట్టుదలకు పోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ అనేక ప్రయత్నాలు చేసి విఫలమైన ప్రభుత్వం తాజాగా.. ధూళిపాళ్ల నరేంద్రకు మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఈసారి కాస్త భిన్నమైన నోటీసులు జారీ చేశారు. ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని… దేవాదాయ, ధర్మాదాయ చట్టంలోని సెక్షన్ 43 ప్రకారం నోటీసులిచ్చారు. 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయాలని కమిషనర్ నోటీసుల్లో పేర్కొన్నారు.
ట్రస్ట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకకోపోతే చర్యలు తీసుకోవాలి కానీ ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని నోటీసులు జారీ చేయడం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇప్పటికే రెండు సార్లు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు దేవాదాయ శాఖ నుంచి జారీ అయ్యాయి. ట్రస్టు డీడ్ , మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టు ఆస్తులు, ఇతర ట్రస్టీల వివరాలకు సంబంధించిన కాపీలు అందించాలని నోటీసులు ఇచ్చారు. ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు, గత మూడు సంవత్సరాల వార్షిక ఆదాయము, ఖర్చులకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. ఇప్పుడు వారంలో స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
అదేమయిందో కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అడుగుతూ నోటీసులు జారీ చేశారు. సంగం డెయిరీ ప్రాంగణంలోనే డీవీసీ ట్రస్ట్ ఉంది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సమయంలో ప్రధానంగా ఈ ట్రస్ట్‌పైనే ప్రభుత్వం, వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అధికారుల నుంచి నోటీసులు వస్తున్నాయి.