ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎలాగైనా నియంత్రించాలనుకుంటున్న ప్రభుత్వం … కొత్తగా ఆలోచించింది. శాసనసభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. అసలు నిమ్మగడ్డ రమేష్ అసెంబ్లీ వ్యవహారాల గురించి కానీ… లేకపోతే ఆ పరిధిలోకి వచ్చే అంశాలపై కానీ ఏమీ మాట్లాడలేదు. కానీ.. ప్రజా ప్రతినిధుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ… ఈ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ అంశంలో మొదటి ట్విస్ట్ ఈ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలనుకుంటోంది మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికల కమిషనర్‌పై ఇష్టం వచ్చినట్లుగా తిట్ల పురాణం వినిపిస్తున్న వీరిద్దరూ… నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమను ఏదో అన్నారని నోటీసులు ఇవ్వబోతున్నారన్నమాట.
వీరిద్దరూ ఎస్ఈసీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ, సుప్రీంకోర్టు ఉల్లంఘన అని గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేయడమే తప్పన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. నిజానికి సభా హక్కులు అనే దానికి స్పష్టమైన నిర్వచనం ఉంది. ఇలా దేనికి పడితే దానికి తమ హక్కులు కోల్పోయామని నోటీసులు ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ.. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఒత్తిడి తేవడానికి తమ దగ్గర ఉన్న మార్గాలన్నింటినీ వెదుక్కుని .. చివరికి అదే ఆప్షన్ ఉన్నట్లుగా నిర్ణయానికి వచ్చింది. అందుకే ముందుగా ప్రకటనలు పంపారు. కొన్ని మీడియాలకు.. తాము నోటీసుల్ని శాసనసభా కార్యాలయంలో ఇచ్చామని సమాచారం ఇచ్చారు.
మరికొన్ని మీడియా సంస్థలకు సోమవారం ఇస్తామని చెప్పుకొచ్చారు. నిజానికి ఆ నోటీసులను… మంత్రులు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఇస్తే.. ఆయన వాటిని ఎథిక్స్ కమిటీకి పంపారు. ఎధిక్స్ కమిటీ పరిశీలించి.. సభాహక్కులు జరిగాయో లేదో పరిశీలించి బాధ్యులకు నోటీసులకు జారీ చేసింది. ప్రస్తుతం రాజ్యాంగబద్ధ పదవిలో ఎన్నికల నిర్వహణలో ఉన్న నిమ్మగడ్డకు ఈ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు వర్తిస్తాయో లేదో క్లారిటీ లేదు. కానీ ప్రభుత్వం ఓ ప్రయత్నం చేయాలని అనుకుంటోంది. ఎవరేమనుకున్నా… వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు.