ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా వారిలో మార్పు రావడం లేదు. రాజకీయ ఆరోపణలు చేసిన వారికి కూడా నోటీసులు పంపుతున్నారు. అది కూడా ఇప్పుడు కాదు.. ఎప్పుడో ముగిసిపోయిన వాటికి ఇప్పుడు నోటీసులు పంపుతున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న మదట్లో కర్నూలులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్.. క్వారంటైన్ సెంటర్ల నుంచి కొంత మంది అనుచరుల్ని తీసుకెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. అప్పట్లో ఆయనపై భూమా అఖిలప్రియతో పాటు మరికొంత మంది రాజకీయ నేతలు విమర్శలు చేశారు. దీనిపై ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ ఇప్పుడు.. భూమా అఖిలప్రియతో ఇతరులకు నోటీసులు జారీ చేసింది.
రాజకీయ నేతలు అనేకానేక ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. అంత మాత్రానే సీఐడీ నోటీసులు జారీ చేయడం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారుతోంది. ఒక్క సీఐడీ మాత్రమే కాదు.. పోలీసులు కూడా అంతే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో దళిత యువకుడి మృతి కేసులో చంద్రబాబునాయుడుకే.. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సాక్ష్యాలివ్వాలని నోటీసులు జారీ చేశారు. పై స్థాయిలో అలా ఉంటే ఇక కింది స్థాయిలో పోలీసులు మాత్రం కామన్‌గా ఉండే అవకాశం లేదుగా.. అందుకే…వైసీపీ నేతలు ఎవరిపై ఫిర్యాదు చేస్తే వారికి నోటీసులు జారీ చేస్తున్నారు.
ఇప్పటికే సీఐడీ.. తీరుపై జాతీయ మానవ హక్కుల సంఘం కూడా విచారణ ప్రారంభించింది. కాంగ్రెస్ నేత గంగాధర్.. కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడినందుకు ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసిది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ హైకోర్టుకు లేఖ రాశారు. హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ ప్రతినిధిని శైలజానాథ్ వద్దకు పంపి.. వివరాలు తెలుసకుంది. ఈ లోపు ఎన్హెచ్ఆర్సీకి కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సీఐడీ రాజకీయ ఆసక్తుల కోసం పని చేస్తోందన్న విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్న సమయంలో… హైకోర్టు తీవ్రంగా హెచ్చరిస్తున్నా.. ఏ మాతరం తీరు మార్చుకోకపోవడం… అధికారవర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.