ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడం.. మళ్లీ వస్తాం.. మీ సంగతి చూస్తామని వైసీపీ నేతుల ప్రెస్మీట్లు పెట్టి బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తూంటారు. అయితే వారి నిర్వాకాలపై కేసులు నమోదు కాగానే కనిపించకుండా పోతారు. కనీసం విచారణకు కూడా హాజరు కారు. నెల్లూరులో ఇంద్రభవనాన్ని కట్టుకున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆ ఇంట్లో ఉండకుండా పరారయ్యారు. క్వార్ట్జ్ ఖనిజాన్ని కొల్లగట్టిన కేసుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసులు నమోదు కాగానే ఆయన సేమ్ డైలాగ్ కట్టి కనిపించకుండా పోయారు. కనీసం విచారణకు వస్తారేమోనని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు ఇంట్లో ఎవరూ లేరన్న సమాధానం వచ్చింది. దాంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు.
కాకాణి గోవర్దన్ రెడ్డి సోమవారమే విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన ఫోన్ ఉపయోగించడం లేదు. స్విచ్చాఫ్ చేసి ఉంచారు. వేరే ఎవరిదో ఫోన్ వాడుతున్నారు. నెల్లూరులోనే దాక్కున్నారా లేకపోతే చెన్నై, బెంగళూరు వెళ్లారా అన్నదానిపై అత్యంత సన్నిహితులకే క్లారిటీ లేదు. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నస్తున్నారని.. అది రాగానే ఆయన బయటకు వస్తారని అంటున్నారు. విచారణకు హాజరు కాకపోతే విచారణకు సహకరించడం లేదని పోలీసులు కోర్టులో చెబుతారు. అందుకే విచారణకు హాజరవడమే మంచిదని సలహాలిచ్చేవారు కూడా ఉన్నారు.
ఒక్క కాకాణి కాదు ఇంకా చాలా మంది నేతలది ఇదే పరిస్థితి. అరెస్టు కాకుండా ఉండటానికి ఆజ్ఞాతంలోకి వెళ్తున్నారు . అరెస్టు చేయరని అనుకున్న తర్వాతనే బయటకు వస్తున్నారు. కానీ వారిపై విచారణలు మాత్రం ఆగడం లేదు. త్వరలో భూవ్యవహారాలపై జరుగుతున్న విచారణలో అనేక మంది జాతకాలు బయటపడతాయని అంటున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో నేతలు మళ్లీ ఆజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం పడే పరిస్థితి వస్తుందని వైసీపీలోనే సెటైర్లు వినిపిస్తున్నాయి.