ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారనో… మంత్రి పదవి ఇచ్చారనో కానీ తన నియోజకవర్గంలో మైనింగ్ ను వైఎస్ అవినాష్ రెడ్డి బంధువులకు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి విడదల రజనీకి చిక్కులు తప్పడంలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో కొంత కాలంగా గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దళితుల భూములు.
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దుచేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ తీసుకొచ్చి.. ఈ తవ్వకాలు ప్రారంభించారు. దీంతో ఆయా భూములు సాగు చేసుకుంటున్నరైతులు కోర్టుకెళ్లారు.
ఈ పిటిషన్ను విచారణ జరిపిన కోర్టు మంత్రి విడదల రజనీ , ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు స్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మొత్తం 21 ఎకరాల 50 సెంట్లు భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ ఇచ్చిన ఎమ్మార్వోకు నోటీసులు వెళ్లాయి. అలాగే రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏపీలో ఎక్కడ మైనింగ్ జరిగినా వైఎస్ కుటుంబసభ్యుల పాత్ర బయటకు వస్తోంది. చిలుకలూరిపేటలోను వారే మైనింగ్ చేయడం.. దానికి తప్పుడు మార్గాలను ఎంచుకోవడం.. వారికి విడదల రజనీ సహకరించడంతో ఆమె కూడా ఇరుక్కుపోయినట్లయింది.
దళితుల భూముల్లో ఒక్కో ఎకరాలో 200 కోట్లు విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రైతులకు తెలియకుండా ఎన్వోసీ ఇవ్వడంపై హైకోర్టు అభ్యంతరంవ్యక్తం చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 10కి వాయిదా వేసింది. అప్పటి వరకూ స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా మంత్రి రజనీ ఇప్పటికే అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మైనింగ్ విషయంలోనూ ఆమె పాత్ర ఉన్నట్లుగా నోటీసులు రావడం కలకలం రేపుతోంది.