జగన్మోహన్ రెడ్డి రాజగురువుగా ప్రసిద్ధి చెందిన స్వరూపానందకు చెందిన ఆశ్రమంలో ఇరవై రెండు సెంట్ల మేర ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లుగా అధికారులు తేల్చారు. కబ్జా స్థలంలో నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి గజం లెక్క చెప్పాల్సిన వస్తోంది.
స్వరూపానందకు మొదట్లో ఓ అద్దె ఇంట్లో ఉంటూ స్వామిజీ అవతారం ఎత్తారు. తర్వాత ఓ వ్యక్తి స్థలం చూపించడంతో చినముషిడివాడలో శారదా పీఠం పేరుతో ఆశ్రమం పెట్టారు. ఆ ఆశ్రమం పక్కనే ప్రభుత్వ భూమి ఉంది. పలుకుబడి పెరిగే కొద్దీ దాన్ని కబ్జా చేస్తూ పోయారు. మొత్తంగా 22 సెంట్లు అంటే పదిహేను వందల గజాల వరకూ కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. గతంలో సర్వే చేయడానికి కూడా అనుమతించేవారు కాదు.
ఇప్పుడు స్వరూపానంద విశాఖలో ఉండటం లేదు. ఆయన వారసుడిగా ప్రకటించుకున్న వ్యక్తి కూడా పెద్దగా బయట కనిపించడం లేదు. ఇప్పుడు ఈ కబ్జాలు తొలగిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. తొలగించకపోతే కూల్చివేస్తారు. అక్కడ ఆలయాల్లాంటి నిర్మాణాలు చేసి ఉంటే సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఆక్రమణల విషయంలో ప్రభుత్వం వ్యవహరించే విధానంపై ఉత్కంఠ ఏర్పడింది.