ఆర్టీసీ సమ్మె ఇంకా ఒక కొలీక్కి రాలేదు. కోర్టులో వాదనలు కూడా ఇంకా ముగియలేదు. ఓపక్క నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ఏం చేస్తోందో తెలీదు. కార్మికులను చర్చలకు పిలుస్తుందా లేదా అనేదీ స్పష్టత లేదు. ఇలా సమస్య ఎక్కడిది అక్కడే ఉంటే… గప్ చుప్ గా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతోంది! ఆర్టీసీలోకి ప్రైవేటు బస్సుల్ని పెద్ద సంఖ్యలో తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇదే అంశమై ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ప్రైవేటు రూట్లపై సర్వే నిర్వహించాలని రవాణా శాఖ అధికారులకు సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో అధికారుల స్థాయిలో ఈ కసరత్తు మొదలైపోయిందనీ, నవంబర్ తొలివారం లేదా రెండో వారంలో కొన్ని రూట్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధంగా నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం జారీ చేసే అవకాశం ఉందంటున్నారు!
ఏయే రూట్లలో ముందుగా ప్రైవేటు బస్సుల్ని ఆహ్వానించాలి, వాటి నియంత్రణ ఎలా, ఒక్కో సీటుకీ ప్రభుత్వానికి ఆయా సంస్థలు చెల్లించాల్సింది ఎంత, నిబంధనలు అతిక్రమిస్తే వారిపై తీసుకోవాల్సిన చర్యలు, టిక్కెటు ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వం దగ్గరే ఉంచాలనీ… ఇలా కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉన్న రూట్లలో ముందుగా ప్రైవేటు బస్సుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతీరోజూ వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి వచ్చే బస్సుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాటి ఆక్యుపెన్సీ కూడా దాదాపు వంద శాతం ఉంటుంది. ఇలాంటి రూట్లు ముందుగా ప్రైవేటుపరం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓపెన్ టెండర్ విధానం కాకుండా, ముందు ఎవరొస్తే వారికి అన్నట్టుగానే ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన సిద్ధమైనట్టు సమాచారం.
ఇలా ప్రైవేటు సంస్థల నుంచి తీసుకొస్తున్న బస్సుల్ని ఎవరి నియంత్రణలో ఉంచాలనే చర్చ కూడా అధికారుల స్థాయిలో జరుగుతున్నట్టు సమాచారం. ఈ బస్సుల్ని ఆర్టీసీ కిందికి తీసుకుని వచ్చే కంటే, నేరుగా రవాణా శాఖ పరిధిలోనే ఉంచి, ఒక ప్రత్యేక అధికారితో పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వినిపిస్తోంది. అంటే, ఆర్టీసీపై ప్రభుత్వం ఎంత స్పష్టతతో ఉందో అర్థమౌతోంది. ఆర్టీసీపై తాను అనుకున్నదే చివరికి చేసేట్టున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. చర్చలకు సిద్ధమని ప్రభుత్వం అనేసరికి… వైఖరిలో మార్పు వచ్చిందేమో అనిపించింది. కానీ, చాపకింద నీరులా ప్రైవేటుపరం చెయ్యడానికి కావాల్సిన చర్యల్ని చకచకా తీసేసుకుంటూ ఉండటం విశేషం!