చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుంటే వ్యవసాయాన్ని పట్టించుకోరన్నది గతంలోని విమర్శ. వ్యవసాయం దండగ అని ఆయన అన్నారనేది బలంగా ప్రచారంలోవుండటంతో టిడిపి నేతలు పదేపదే తామే దాన్ని ప్రస్తావించి ఖండిస్తుంటారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన స్వయంగా ఇందుకు సమయం కేటాయించేవారు. దాన్నుంచి బయిటపడేందుకే రైతు రుణమాపీని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అంతకు ముందు పదవీ కాలంలో వలె గాక ఈ సారి నీటి ప్రాజెక్టులకోసం తిరుగుతున్నారు. ఇన్ని చేసిన చంద్రబాబు తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశానికి ముందు అధికారికంగా మళ్లీ అచ్చంగా ఇలాటి విమర్శలకే అవకాశమిచ్చారు. రైతులను వ్యవసాయం నుంచి పరిశ్రమలకు తరలిస్తే జిడిపి 1.5 శాతం పెరుగుతుందని ఒక లెక్క వేశారు. దానివల్ల వారంతా పారిశ్రామిక రంగంలోకి అడుగుపెడతారని ఆయన ఉద్దేశం. వ్యవసాయ రంగంలో కన్నా సర్వీసు రంగంలో దాదాపు 4 రెట్లు, పారిశ్రామిక రంగంలో 5 రెట్లు ప్రయోజనం కలుగుతుందని సర్కారు అంచనా వేసింది. ఇందుకు తగినట్టే కలెక్టర్ల సమావేశంలోనూ ముఖ్యమంత్రి ఇలాటి సంకేతాలిచ్చారు. డ్రైవర్ లేని ట్రాక్టర్ల వంటివి వచ్చాక వ్యవసాయంలో ఉపాధి తగ్గుతుందన్నారు. కోటి ఎకరాలను ఉద్యాన పంటల వైపు మారిస్తే బాగుంటుందని సూచించారు. నిజానికి ఈ ఏడాది జిఎస్డిపి జాతీయ సగటు కన్నా ఎపిలో ఎక్కువగా వుందని ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి మూలం వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులే. రొయ్యల ఉత్పత్తి 42 శాతం నుంచి 66.86 శాతానికి పెరిగింది. మరోవైపున తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. భూసేకరణ జోరు, రుణమాఫీ మూడవ విడతలో ఆలస్యం, బ్యాంకులు రైతులకు ఇవ్వాల్సిన రుణాల లక్ష్యం 17శాతం దాటకపోవడం ఇవన్నీ కలసి వ్యవసాయాన్ని ఇబ్బందులలోకి నెట్టాయి. పంటల గిట్టుబాటు ధరల సమస్య వంటివి వుండనే వున్నాయి.ఇలాటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయం నుంచి మరల్చడం అనడం ద్వారా పాత విమర్శలు పైకి రావడానికి ప్రేరణ ఇచ్చారన్నమాట. పారిశ్రామిక పెట్టుబడులు పెద్దగా రాని ఎపిలో వ్యవసాయం కూడా దెబ్బతింటే ఏం చేయాలన్నది పెద్ద సవాలే.