ఒక సాధారణ ఉప ఎన్నికను రాష్ట్ర స్థాయి ఎన్నికగా చిత్రిస్తూ అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, నంద్యాల వేడి ఇకపై చల్లారుతుంది. దీంతో ఇప్పుడు ప్రధాన పార్టీల దృష్టంతా కాకినాడపైకి మళ్లింది. అక్కడ ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్ని కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. మామూలుగా అయితే, స్థానిక సంస్థ ఎన్నికలు అంటే… అక్కడి సమస్యలకే ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయ పార్టీలకంటే ముఖ్యంగా స్థానిక సమీకరణలపైనే ప్రజా తీర్పు ఉంటుంది. కానీ, ఈ ఎన్నికలో కూడా స్థానిక అంశాల కంటే, రాష్ట్ర స్థాయిలో పాలనాంశాలనే ప్రచారాస్త్రాలుగా తెరమీదికి తీసుకురావడం విశేషం! కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అభివృద్ధి నినాదాన్ని తెలుగుదేశం వినిపిస్తుంటే… చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే వైకాపా ఆధారపడింది.
ఈ నెల 29న కాకినాడ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రచార పర్వానికి మరో ఐదు రోజులు గడువు ఉంది. దీంతో, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కాకినాడలో సందడి చేస్తున్నారు. ఈ ఎన్నికలో టీడీపీ, వైసీపీ, భాజపా, కాంగ్రెస్, బీఎస్పీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు ఓట్ల వేటలో నిమగ్నమై ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కాకినాడలో కూడా అభివృద్ధి నినాదమే వినిపిస్తోంది. కాకినాడను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడం ద్వారా గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూడా మంత్రులు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ ఎన్నిక విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాకినాడలో కూడా కుల సమీకరణలే తెరమీద కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాపులను ఆకర్షించడంపై అధికార ప్రతిపక్షాలు దృష్టిపెట్టాయనడంలో సందేహం లేదు.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక ముంచుకొస్తున్న సందర్భంలోనే కాపు నేతలతో ఇటీవల ముఖ్యమంత్రి భేటీ అయిన సంగతి తెలిసిందే. కాపుల రిజర్వేషన్లతోపాటు అన్ని సమస్యలూ తీర్చేస్తామని హామీ ఇవ్వడం వెనక కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో తాత్కాలిక లబ్ధి ఆశించడమే వ్యూహమని చెప్పుకోవచ్చు. ఇక, వైకాపా విషయానికి వస్తే.. నంద్యాల ప్రచార వ్యూహాన్నే ఇక్కడా అనుసరించడం విశేషం! తెలుగుదేశం పార్టీపై విమర్శలనే తమ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువగా జరుగుతోందనీ, చంద్రబాబు నాయుడు మూడేళ్ల పాలనపై ప్రజలు విసుగు చెందారనీ, రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తూ నాయకులు ప్రచారం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా ప్రధాన పార్టీలు ఇంత ప్రతిష్టాత్మకంగా మార్చేస్తున్నాయి. మంత్రులూ రాష్ట్ర నేతలూ ప్రచారంలోకి వచ్చేస్తున్నారు. భవిష్యత్తు పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు కూడా మంత్రులు, బడా నాయకులు ప్రచారానికి వచ్చేస్తారేమో..!