మనది కాస్తా మాది అయిపోయాక ఉన్నది ఉన్నట్టే ఉండటం కుదరదనిపిస్తున్నది. ప్రపంచమంతా ఇదే ధోరణితో వున్నట్టు వుంది. ఉమ్మడి కుటుంబాలు న్యూక్లియస్ కుటుంబాలు అయిపోతున్న కాన్సెప్టు ఇళ్ళ నుంచి ఊళ్ళకు, ఊళ్ళనుంచి ప్రాంతాలకు, ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుంచి దేశాలకూ పాకినట్టు వుంది.
యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని బ్రిటన్ ప్రజలు (బ్రెగ్జిట్)నిర్ణయించుకున్నాక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(యూఎస్ఏ) నుంచి టెక్సాస్ స్టేట్ విడిపోయే అంశం టెక్సాస్+ఎగ్జిట్ (టెగ్జిట్) ప్రజల్లో గట్టిగా చర్చకువచ్చింది.
బ్రిటన్‌లో మాదిరిగా టెక్సాస్‌లో కూడా యూఎస్ఏతో కలిసి ఉండాలా.. విడిపోవాలా అనే అంశంపై ప్రజాభిప్రాయం సేకరించాలని కొందరు కోరుతున్నారు. ట్విట్టర్ ట్రెండింగ్‌లో టెగ్జిట్ బాగా కనిపిస్తోంది.
మెక్సికో నుంచి స్వాతంత్య్రం పొందిన టెక్సాస్ 1836 సంవత్సరం నుంచి 1845 వరకు స్వతంత్ర దేశంగా ఉండేది. 1845లో 28వ రాష్ట్రంగా యూఎస్ఏలో చేరింది. అమెరికాలోని టెక్సాస్ జనాభాపరంగానూ, వైశాల్యంలోనూ రెండో అతి పెద్ద రాష్ట్రం. హ్యూస్టన్, శాన్ ఆంటోనియో, డల్లాస్, ఆస్టిన్ లాంటి ప్రముఖ నగరాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. 1.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయాలున్న టెక్సాస్ దేశంగా ఉంటే ప్రపంచంలో తొలి పది పెద్ద దేశాల జాబితాలో ఉండేదని టెక్సాస్ నేషనలిస్ట్ ఉద్యమకారులు చెబుతూంటారు.
అమెరికాలో ఉండాలా వద్దా అనే విషయంపై టెక్సాస్ ప్రజల అభిప్రాయ సేకరణ జరగాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ బ్రెగ్జిట్‌పై ప్రజల తీర్పు అద్భుతమైనదని వ్యాఖ్యానించారు. మరి ”టెగ్జిట్” పై ట్రంప్ ఎలా స్పందిస్తారో?
ఉనికి, అస్ధిత్వాలను ఘనంగా నిలబెట్టుకోవాలన్న బౌతిక అంశాలు – ఎమోషన్లు సెంటిమెంట్లు గా మారినపుడు జరుగుతున్న విభజనలకు భారతదేశంలో తాజా ఉదాహరణ తెలంగాణా ఆవిర్భావం! దేశంలో మరో 9 రాష్ట్రాల్లో కూడా వేర్పాటు డిమాండ్లు వున్నాయి.