అప్పు ఇప్పించి చేతులు దులిపేసుకునే కేంద్రం ఎత్తుగడ?
జాతీయప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఎవరు ఇస్తారు?, అప్పు చేసి ప్రాజెక్టు కడితే తీర్చవలసింది కేంద్రమా? రాష్ట్రమా? కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి పరస్పర విరుద్ధంగా మాట్లాడటాన్ని బట్టి ఈ అనుమానం వ్యక్తమౌతోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని విభజన చట్టంలో పొందుపరచారు. రెండేళ్ళలో కేవలం 500 కోట్లరూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఇలాగే నిధులు విడుదల చేస్తూ వుంటే యాభై ఏళ్ళకైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాదన్న ఆందోళన వుంది. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధులు ఇవ్వబోవడం లేదని ఢిల్లీలో తెలుగు మీడియాకు ఒక లీకు అందింది. దీనిపై కొందరు విలేకరులు జలవనరుల మంత్రి ఉమాభారతి ని ఈ విషయం ప్రశ్నించారు. ”పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందువల్ల ఖర్చు, నిర్మాణ బాధ్యతా కేంద్రప్రభుత్వానిదే”నని ఆమె స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ”పోలవరం ప్రాజెక్టు బాధ్యత మనదే”నని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ రాసి ఆకాపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపారు.
ఉన్నతస్ధాయి వ్యక్తుల సమాచారం ప్రకారం అప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం ఒక ఫార్ములాను రూపొందించింది. ఆప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 70 శాతం మొత్తాన్ని కేంద్రప్రభుత్వం రుణంగా ఇప్పిస్తుంది. మిగిలిన 30 శాతం నిధులనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సమకూర్చుకోవాలి. ఈ ప్రతిపాదన ఏ విధంగానూ సమ్మతం కాదని చంద్రబాబు నాయుడు అధికారుల ద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికి స్పష్టం చేశారు.
అయితే గురువారం లోక్‌సభలో 2015-16 బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బదులిస్తూ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రుణం ఇప్పిస్తుందని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డ్ నుంచి పెద్దఎత్తున రుణాలు మంజూరు చేయిస్తామని జైట్లీ ప్రకటించగానే ఒడిశాకు చెందిన బిజెడి ఎంపీలు లేచి తీవ్ర నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తాము దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణలో ఉండగా రుణ సదుపాయం కల్పిస్తామని మంత్రి ఎలా హామీ ఇస్తారని వారు నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు వాకౌట్ చేశారు.
ఇది జరిగిన తరువాత పార్లమెంటు ఆవరణలో కొందరు విలేకరులు ఉమాభారతిని కలసి ప్రాజెక్టు గురించి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు ఎన్డిఏ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని హామీ ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున దానికయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని ఆమె పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం నాబార్డ్ నుంచి రుణం తీసుకుంటామని ఉమాభారతి స్పష్టం చేశారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాతనే పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేశామని కూడా ఆమె వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టుకి రుణం తీసుకుంటామని ఉమాభారతి విలేకరులకు, రుణం ఇప్పిస్తామని అరుణ్ జైట్లీ లోక్ సభకు చెప్పడాన్ని గమనిస్తే విభజన చట్టం లో లేని ”ప్రత్యేక హోదా” మాదిరిగా విభజన చట్టంలో వున్న జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కూడా ఎగవేయడానికే కేంద్రం సిద్ధపడుతోందని అర్ధమౌతోంది.