తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెల మొదటి వారంతో రెండు రాష్ట్రాల నుంచి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో నాలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి కాగా, తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 50 స్థానాలు ఖాళీ అవుతాయని, వాటికి మార్చి నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహిస్తారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహమ్మద్ అలీ ఖాన్, కే.కేశవరావు, టి.సుబ్బిరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి కే.వీ.పీ. రామచంద్ర రావు, గరికపాటి మోహన్ రావుల పదవులు ఖాళీ అవుతాయి.
సమైక్య రాష్ట్రం విడిపోక ముందు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన కేశవరావు, కే.వీ.పీ. రామచంద్ర రావులను రాష్ట్రం విడిపోయిన తరువాత చెరో రాష్ట్రానికి కేటాయించారు. ఎక్కడ ఎలాంటి తప్పిదమో.. ఏ నిబంధనలో కానీ తెలంగాణకు చెందిన కేశవరావు ఆంధ్రప్రదేశ్ కోటాలను, ఏపీకి చెందిన కే.వీ.పీ.రామచంద్ర రావు తెలంగాణ కోటా లోనూ సభ్యులుగా ఉన్నారు. ఇది అప్పుడప్పుడు వివాదాలకు దారి తీస్తోంది. ఇప్పుడు వీరిద్దరూ పదవీ విరమణ చేస్తున్న సమయంలో ఈ రెండూ ఖాళీలను ఆయా రాష్ట్రాలకు చెందిన నాయకుల తోటే భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలను అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది.
తెలంగాణలోనూ అధికార పార్టీకే రెండు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలోనూ రాజ్యసభ టిక్కెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాల్లోనూ మైనారిటీ, బీసీ, దళిత వర్గాలకు మూడు స్థానాలు కేటాయించే అవకాశం ఉంది అంటున్నారు. ఇందులో ఒక స్థానాన్ని మహిళకు కట్ట పెట్టవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని పాలన సాగిస్తున్నారని వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఆ పదవి కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ స్థానాన్ని కూడా మహిళతో భర్తీ చేస్తే ఆ సామాజికవర్గంతో పాటు ఆ వర్గానికి చెందిన మహిళలను కూడా శాంతింప చేయవచ్చునని పార్టీ పెద్దలు సూచిస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో ఉన్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అగ్రవర్ణానికి, మరొకటి మైనారిటీ లేదా మహిళకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కి అప్పగించినట్లుగా తెలంగాణ భవన్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ సీనియర్లు సహా రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్న వారంతా కేటీఆర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఆయన దయాదాక్షిణ్యాలు ఎవరిపై ఉంటాయో వేచి చూడాల్సిందే…!