జేసీ దివాకర్ రెడ్డి మీద పరిటాల కుటుంబం చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. పరిటాల రవి బతికున్న రోజుల్లో ఆయన జేసీ దివాకర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేసేవాడు. ఫ్యాక్షనిజం విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూనే రవి.. జేసీ పై విరుచుకుపడే వాడు. అనంతలో అశాంతికి మూలం జేసీ కుటుంబమే అని రవి విమర్శించేవాడు. ఆ సంగతలా ఉంటే, పరిటాల రవి హత్యానంతరం తెలుగుదేశం పార్టీ జేసీ పై భగ్గుమంది. రవి హత్యలో దివాకర్ రెడ్డి పాత్ర ఉంది.. అని తెలుగుదేశంపార్టీ ఆరోపించింది. ఎక్కడెక్కడి తెలుగుదేశం నేతలో అనంత వచ్చి జేసీపై విరుచుకుపడ్డారు.
జేసీ, జగన్ లు కుట్ర పన్ని పరిటాల రవిని హత్య చేయించారనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసిన గట్టి ఆరోపణ. దీనిపై సీబీఐ విచారణ కు కూడా డిమాండ్ చేసింది తెలుగుదేశం. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయానికి గతాన్ని అంతా పక్కనపెట్టింది టీడీపీ. గతంలో జేసీ పై కారాలూమిరియాలూ నూరిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దగ్గుండి జేసీ సోదరులకు పచ్చకండువా వేశాడు. అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు అనంతలో కొత్త రాజకీయం మొదలైంది.
మూడు కుమ్ములాటలు, ఆరు విబేధాలతో ఉన్న అనంత తెలుగుదేశంలో జేసీ, పరిటాల కుటుంబాల మధ్య దూరం తగ్గిందనేది తాజాగా వినిపిస్తున్న మాట. అనంత టీడీపీలో పలువురు నేతలు ఇప్పుడు కూడా జేసీపై విమర్శలు చేస్తూ ఉన్నారు. అలాగే పరిటాల కుటుంబం పొడ గిట్టని టీడీపీ నేతలూ ఉన్నారు. ఇలాంటి సమీకరణాల మధ్య అంతిమంగా రవి కుటుంబానికి, జేసీ సోదరులకు దూరం తగ్గిందనేది లేటెస్ట్ పొలిటికల్ అప్ డేట్. దీనికి కారణాలు ఏమైనా.. ఒకరిపై ఒకరు హత్యారోపణలు చేసుకున్న వాళ్లు, మా వాళ్లను చంపేశారని.. ఒకరినొకరు దూషించుకున్న వీళ్ల మధ్య సాన్నిహిత్యం పెరగడం మాత్రం ఆసక్తిదాయకమైన అంశమే!