గత ఏడాది కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో అందరూ మర్కజ్ వైపే వేళ్లు చూపించారు. అక్కడ విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేయడం వల్లనే కరోనా వ్యాప్తి చెందిందని… అక్కడ ప్రార్థనలు చేసిన వారు దేశవ్యాప్తంగా సంచరించడం వల్ల వైరస్ పాకిపోయిందని విమర్శించారు. ఆ మర్కజ్‌పై ప్రభుత్వంపై ఎన్నో ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు ఆ విషయం అందరూ మర్చిపోయారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న ఈ సమయంలో.. మర్కజ్‌తో పోలిస్తే కొన్ని రెట్లు ఎక్కువ జనం పోగవుతున్న కార్యక్రమం కుంభమేళా. తొలి రోజే ముఫ్పై లక్షల మంది గంగ స్నానాలు చేశారు. ఇంకా లక్షల మంది కుంభమేళాకు వెళ్తున్నారు.
అయితే .. అక్కడ నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందని వెళ్లవద్దని… ఎవరూ ప్రచారం చేయడం లేదు. దీంతో సమస్య ప్రారంభమయింది. కుంభమేళా నుంచి పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. నాగ సాధువులే కరోనా బారిన పడుతున్నారు. ఇక సామాన్య భక్తుల సంగతి చెప్పాల్సిన పని లేదు. కోవిడ్ నెగెటివ్ వచ్చిన వాళ్లే వారణాశికి రావాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది కానీ.. అదంతా మాట వరుసకే. ఇప్పటికే కర్ణాటక వంటి రాష్ట్రాలు.. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వాళ్లు ఖచ్చితంగా టెస్టులు చేయించుకుని హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచనలు చేస్తున్నాయి.
ఇతర రాష్ట్రాలు అసలు పట్టించుకోవడం లేదు. ఈ సారి మర్కజ్ కన్నా దారుణంగా సూపర్ స్ప్రెడర్గా… కుంభమేళా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మర్కజ్ విషయంలో విపరీతంగా ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు మాత్రం. అవగాహన కల్పించడంలో విఫలం అవుతోంది. దీంతో సహజంగానే మతం రంగు పులుముకుంటోంది. ముస్లింలకు సంబంధించిది కాబట్టే.. మర్కజ్‌పై రచ్చ చేశారని.. హిందువులది కాబట్టే.. కుంభమేళాపై మాట్లాడటం లేదని చర్చలు జరుగుతున్నారు. కానీ కరోనాకు హిందూ… ముస్లిం తేడా లేదనే సంగతిని అందరూ గుర్తించాల్సి ఉంది.