హైదరాబాద్: పిల్లల ఫేస్బుక్ వాడకాన్ని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్లో అబ్దుల్ మాజీద్ అనే బీటెక్ స్టూడెంట్ నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్లతో ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రముఖ కళాశాలల్లో చదివే ఆడపిల్లలతో స్నేహంచేసి వారిని మోసగించిన విషయం నిన్న బయటపడిన నేపథ్యంలో పోలీసులు ఈ హెచ్చరికలు చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలు ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా సైట్లలో ఏమి చేస్తున్నారో తెలియదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు సైబర్ సెక్యూరిటీగురించి వివరించాలని సూచించారు. ముఖ్యంగా టీనేజర్ల సోషల్ మీడియా వాడకాన్ని ఎల్లప్పుడూ గమనించాలని చెప్పారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అన్ని అంశాలనూ పాఠశాలల్లో తప్పనిసరిగా బోధించేటట్లు తెలంగాణలో కొత్త చట్టం రాబోతున్నట్లు తెలిపారు.
తాజాగా బయటపడిన అబ్దుల్ మాజీద్ వ్యవహారంలో అతను దాదాపు 200మంది ఆడపిల్లలతో నకిలీ ఫేస్బుక్ ఎకౌంట్ల ద్వారా ఫ్రెండ్షిప్ చేసుకుంటే, ఆ ఆడపిల్లల తల్లిదండ్రులెవరికీ ఈ విషయంగురించి కొద్దిగాకూడా తెలియదని ఆనంద్ చెప్పారు. ఆ పిల్లలుకూడా వారి తల్లిదండ్రులకు చెప్పలేదని తెలిపారు. పిల్లలు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం తల్లిదండ్రులు ఇవ్వాలని అన్నారు. అబ్దుల్ మాజీద్ ఈ 200మంది ఆడపిల్లల్లో చాలామందిని బుట్టలో వేసుకుని వారి నగ్నచిత్రాలను, సంభాషణలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నాడు. ఆ 200మందిలో ఒక అమ్మాయి బయటకొచ్చి ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం బయటపడింది.