స్థానిక సంస్థల ఎన్నికల వివాదం..రెండు నెలల వరకు సద్దుమణగడం ఖాయం కావడంతో.. ఏపీ సర్కార్.. ఇప్పుడు వెంటనే… సచివాలయాన్ని విశాఖకు తరలించే అంశాన్ని టేకప్ చేసింది. ఈ మేరకు వెంటనే కార్యాచరణ ప్రారంభించింది. మంగళవారం ఉన్నత విద్యాశాఖ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం మినిట్స్‌లో మొట్టమొదటిది.. విశాఖకు తరలిపోయే అంశమే. విశాఖకు తరలిపోయే ఏర్పాట్ల కోసం… ఉన్నత విద్యాశాఖ అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. ఈ మేరకు.. ఉద్యోగులకు… సమాచారం ఇచ్చారు. మే నెలాఖరు కల్లా.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖ నుంచి పని చేయడానికి సిద్ధంగా ఉండాలని..అందు కోసం.. ఏమేం చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించారు.
ఒక్క ఉన్నత విద్యాశాఖ విషయంలోనే కాదు.. మిగతా అన్ని విభాగాలకు ఈ మేరకు ప్రభుత్వ నుంచి స్పష్టమైన సూచనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మే నెలాఖరు కల్లా విశాఖ వెళ్లిపోవాలని.. ఇందులో ఎలాంటి మార్పులు ఉండవని.. దానికి తగ్గట్లుగా ఇప్పటి నుండే సన్నాహాలు చేసుకోవాలని ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు.. అధికారికంగా.. తమ సమావేశాల్లో మినిట్స్‌లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి.. చర్యలు తీసుకుంటున్నారంటున్నారు. సచివాలయ ఉద్యోగ సంఘాలు కూడా.. దీనిపై ఇప్పటికే .. ఉద్యోగుల్ని సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అనేక తాయిలాలు ప్రకటిస్తూ… ఉద్యోగ సంఘాల నేతలు సమావేశాలు పెడుతున్నారు.
అయితే.. ఈ ప్రయత్నాలన్నీ మరోసారి వివాదాస్పదం కావడం ఖాయమన్న అంచనాలున్నాయి. ఇప్పటికీ హైకోర్టు.. గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోలేదు. ఎలాంటి కార్యాలయాలను తరలించవవద్దని స్పష్టం చేసింది. దానిపై విచారణ జరుగుతోంది. ఏవైనా కార్యాలయాలను తరలించినా… అధికారుల్నే బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ.. సీఎంవోలోని కొంత మంది.. ముఖ్యమంత్రికి సన్నిహితులైన అధికారులు.. నోటి మాట ద్వారా పనులు మాత్రం చక్క బెడుతున్నారు. ఇది వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం.. వేస్తున్న ప్రతి అడుగు … వివాదాస్పదం అయి.. చివరకి ఎటూ కాకుండా ఆగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.