సెలబ్రటీ కల్చర్ చుట్టూ ప్రదక్షిణలు కొట్టే మన మీడియా ధోరణి రానురాను హాస్యాస్పదంగా మారుతున్నది. పోనీ సుప్రసిద్ధులైతే అదో తీరు. టీవీలతో సినిమాలతో సంబంధం వున్నవారైతే చాలునన్నట్టు వారి వ్యక్తిగత తగాదాలను వివాదాలను హెడ్‌లైన్స్‌లో చూపించడం విసుగెత్తిస్తుంది. ఈ రెండు మూడు రోజులలోనూ టీవీ నటి శ్రీవాణికుటుంబానికి ఆమె వదినకూ మధ్యన గొడవ ఏ విధంగా అగ్రశ్రేణి ఛానళ్ల ప్రసారాలకు అర్హమైందో అర్థం కాదు. వాస్తవంగా వున్న సమస్య ఏమిటో కూడా పూర్తిగా తెలియకుండానే కేవలం తార గనక ఇంత మోత! నిజానికి పెద్ద తారలు కాకున్నా జూనియర్ నటులు, పేరు తెలియని సినిమాలలో నటించినవారికి సంబంధించిన వివాదాలను కూడా ఇలాగే అతిగా చూపించడం రోత పుట్టిస్తుంటుంది. నిజానికి కొంతమందికి ఇది లేని ప్రచారం తెచ్చిపెడుతుందా అని కూడా సందేహం కలుగుతుంది. ఇటీవలనే సల్మాన్ ఖాన్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్య దానిపై దుమారం ఆయన సుల్తాన్ చిత్రం రికార్డు కలెక్షన్లకు దోహదకారి అయిందని నిపుణుల విశ్లేషణలు చెబుతున్నాయి. తను చేసిన తప్పు వ్యాఖ్యను ఆయన సూటిగా ఉపసంహరించుకోవడం గాని క్షమాపణలు చెప్పడం గాని ఇంతవరకూ జరగలేదు. కాని దీనివల్ల తమ హీరోను కాపాడుకోవాలని కొందరు అదనపు ఆసక్తితో వెళ్లి చూసి వుంటారని అంచనా వేస్తున్నారు. అంతా అయ్యాక ఆయన తండ్రి రచయిత సలీమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ తరహాలోనే వున్నాయి. నిజానికి హాలివుడ్లో ఇలాటి ముఖ్యమైన ప్రచార ఫార్ములా అనుసరిస్తుంటారు. తమ గురించి గాసిప్ప్ గాని కాంట్రవర్సీలు గాని లేకపోతే కావాలని సృష్టించి ముందుకు తెస్తారు. ఈ మధ్య కాలంలో తెలుగు నటీనటులు కొందరు సోషల్ మీడియాలో తమపై ఏవో వదంతులు వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఒక పెద్ద ప్రచారంగా నడిచింది. ఇలాటివి మామూలుగా లోలోపల సర్దుబాటు చేసుకుంటారు. లేదంటే ఒక వివరణ ఇచ్చిసరిపెడతారు. బెదిరింపులు వంటివి లేదా రాజకీయ వివాదాలు అయితే అదో తీరు. కాని తమకు ఏవో కాల్స్ వస్తున్నాయనీ లేదంటే సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయని భారీ ప్రచారం చేసుకోవలసిన అవసరం వుండదు.
ఇందుకు భిన్నమైన విషాద సందర్భం మరొకటి. ఈ మధ్య చిన్నారి రమ్య ప్రమాదంలో మరణించడం అందరినీ కలచి వేసింది.అయితే ఆమె అంత్యక్రియలు కుటుంబసభ్యుల విషాదం వంటివాటిపై విపరీతమైన ఫోకస్ ఇవ్వడం ఆ తర్వాత ఒకటికి రెండు సంస్మరణయాత్రలు ఇవన్నీ కూడా మీడియా ఓవర్రీచ్లా వున్నాయనే భావం చాలామందిలో వ్యక్తమైంది. మరి మన మిత్రులు ఆలోచిస్తారో లేదో..
ఇప్పుడు సమంత నాగచైతన్య వివాహం విషయంలోనూ కొన్ని సోషల్ మీడియా సైట్లు చూపిస్తున్న అత్యుత్సాహం అలాగే వుంది.గ్లామర్ తారలు గనక చెప్పుకోవడంలో తప్పు లేదు గాని ఏ కొత్త అంశం లేకున్నా వూరికే సాగదీసి సాగదీసి ఇస్తున్నాయి. దీనివల్ల వారికి కలిగి ఇబ్బంది మాటేమో గాని అవేవో గొప్పసంగతులునే భ్రమ కలిగే అవకాశం వుంటుంది. నిజానికి ఒకసారి నిర్ణయమైందన్నతర్వాత అందులో అంతగా చెప్పుకోవలసిన మలుపులేమీ ఇంతవరకూ లేవు. అయినా సరే ఏదో ఒక ముక్క పట్టుకుని సాగదీయడం అవసరమా అద్యక్షా?