రూపాయి పతనం.. శరవేగంగా సాగుతోంది. ఇప్పటి నుంచి కాదు.. చాలా రోజుల నుంచి పతనం ఉంది. అయితే.. ఈ పతనం.. నిన్నమొన్నటిదాకా.. రోజుకు 2 లేదా 3 పైసల స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఏకంగా రోజుకు రూపాయి తేడా కనిపించే స్థాయికి వచ్చింది. రూపాయి పతనాన్ని ఊహించినప్పుడే… గుర్తించి… కేంద్రం తరపున కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం..” పై వాడిదే భారం” అంటే.. సైలెంట్‌గా ఉండిపోయింది. ఫలితంగా.. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే రీతిలో.. రూపాయి పతనం సాగుతోంది. దీంతో ఇప్పుడు రూపాయి పతనాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అది ఎన్నారైలను బతిమాలుకోవడం.
రూపాయిని నిలబెట్టడానికి ప్రవాసుల సాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర దేశాల్లో స్థిరపడ్డ భారతీయుల నుండి పెద్దయెత్తన డాలర్లను సేకరించడం ద్వారా.. రూపాయికి విలువ పెంచాలని ఆలోచిస్తోంది. అందుకోసం ప్రత్యేక పథకాన్ని కూడా తీసుకురావాలని నిర్ణయించింది. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. 2013లో రూపాయి పతనం శరవేగంగా ఉన్నప్పుడు.. అప్పటి ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్ రాజన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. డాలర్లలో చెల్లించాల్సిన దిగుమతుల్ని.. తగ్గించగలిగారు. బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు విధించారు. ఎన్నారైల దగ్గర్నుంచి డాలర్ల సేకరణ కోసం పెట్టుబడి పథకం ప్రవేశ పెట్టారు. ఇప్పుడు మిగతా వాటిని పెద్దగా పట్టించుకోని కేంద్రం.. వారి వద్ద ఉన్న డాలర్లను మాత్రం… స్వేదేశానికి తీసుకు రమ్మని అడుగుతోంది.
అంతకంతకు క్షీణిస్తున్న రూపాయి విలువతో..బంగారం పండుగ చేసుకుంటోంది. రూపాయి విలువ పడిపోతుండటంతో, బులియన్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగింది. బంగారానికి గ్లోబల్‌గా డిమాండ్ లేనప్పటికీ, దేశీయంగా మాత్రం రివర్స్ ట్రెండ్ నమోదైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.మరోవైపు ముడిచమురు ధరలు తగ్గే సూచనలు కూడా సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు.మరోవైపు పెరిగిపోతున్న ధరలపై ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అంతకు మించి చేయడానికి తమ వద్ద సరుకు లేదని అంగీకరిస్తోంది.