ఇంగ్లాండ్ రాకుమారి పెళ్లికి రెడీగా ఉందని… తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి కాని ప్రసాదుల్ని టార్గెట్ చేసే నైజీరియన్ గ్యాంగుల అరాచకాలు మనం చాలా చూశాం. ఇంగ్లిష్ సినిమాల్లో నటించిన హీరోయిన్ల ఫోటోలు పంపి… స్పైసీ చాటింగ్ చేసి.. ఈ నైజీరియన్లు చాలా నమ్మకంగా ముగ్గులోకి దించుతారు. నమ్మిన తరవాత ప్రైజులు పంపామని… ఇంట్లోవాళ్లకి బాగోలేదని డబ్బులు అడుగుతారు. అప్పటికే మత్తులో పడిపోయిన పెళ్లి కాని ప్రసాదులు.. లక్షల్లో మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఈ తరహా మోసాల్లో నైజీరియన్లు ఆరితేరిపోయారనుకుంటే… ఓ తెలుగు కుర్రాడు కూడా… ఇదే తరహా మోసం చేసి అడ్డంగా బుక్కయ్యాడు.
హైదరాబాద్ మియాపూర్ కు చెందిన రాజూరి విక్రమ్ అనే యువకుడ్ని హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో కుటుంబసభ్యులకు కూడా అర్థం కాలేదు. పోలీసులు చెబితేనే వారికి తెలిసింది… నైజీరియన్ గ్యాంగ్‌ను మించిపోయే మోసం చేశాడని. బీటెక్ చదివి బంధువుల సాయంతో అమెరికా వెల్లిన విక్రమ్‌కు ఉద్యోగం దొరకలేదు. అయితే అక్కడే ఓ వ్యాపారం ప్రారంభించాడు. బంధువుల అమ్మాయిని అక్కడే వివాహం చేసుకున్నాడు. కానీ డబ్బులపై ఆశతోనే… నైజీరియన్ గ్యాంగుల నుంచి స్ఫూర్తి పొందాడో కానీ… పెళ్లి నాటకం ప్రారంభించాడు.ఓ మ్యాట్రిమోనియల్ సైట్ లో ప్రొఫైల్ ఉంచాడు.
అయితే అందులో ఒక్క ఫోన్ నెంబర్ తప్ప అన్నీ ఫేకే. ఓ తమిళ మోడల్, నటుడి ఫోటో ప్రొఫైల్ పిక్ గా పెట్టాడు. దీంతో టచ్‌లోకి వచ్చిన అమ్మాయిల్లో మంచి సౌండ్ పార్టీలను చూసుకుని మోసం చేయడం ప్రారంభించాడు. ఇలా హైదరాబాద్ కు చెందిన ఓ యువతిని ట్రాప్ చేశాడు. మాటలు చెప్పాడు. చాట్ చేశాడు. ఇక పెళ్లికి రెడీ అని చెప్పేశాడు. తర్వాత తన తల్లికి అనారోగ్యంగా ఉందని.. అర్జంట్ గా డబ్బులవసరం అని… అడగడం ప్రారంభించాడు. అప్పటికే విక్రమ్ ను పూర్తిగా నమ్మిన బాధితురాలు దాదాపుగా రూ. 7 లక్షలు విడతల వారీగా ఇచ్చింది. తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దాంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచి పోలీసులు నిఘా పెట్టారు. వివరాలన్నీ బయటకు లాగారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలియని విక్రమ్.. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడు. కుటుంబసభ్యులను కలిసి… పనులు పూర్తి చేసుకుని మళ్లీ అమెరికా వెళ్దామని బయలుదేరాడు. కానీ విమానాశ్రయంలో దొరికిపోయాడు. ఇప్పుడు ఈ విక్రమ్.. ఇంకా ఎంత మందిని మోసం చేశాడన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ధైర్యం చేసి బాధితురాలు ఫిర్యాదు చేశారు కాబట్టి దొరికాడు. కానీ పరువు పోతుందనే భయంతో ఇంకా చాలా మంది కంప్లైంట్లు చేయలేదని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడీ విక్రమ్ చరిత్రను పోలీసులు బయటకు తీస్తున్నారు.