అందరూ సామాన్యలుగానే పడతారు. కానీ ఆసామాన్యులుగా ఎదిగేవారు కొందరే. డబ్బు సంపాదించడమో.. తాము పని చేసే రంగంలో ఉన్నత స్థానానికి వెళితేనో అసామాన్యులుగా మారరు. ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన వారే అలా గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఎన్టీఆర్ అలాంటి కోవలోకి వస్తారు. ఆయన సినిమాల్లో అయినా.. రాజకీయరంగంలో అయినా తనదైన ముద్ర వేశారు. అది ఆయన ఎదగడంలో కాదు.. ప్రజల్ని… తెలుగు ప్రజల్ని ఎదిగేలా చేయడంలో.
తెలంగాణలో ఈ రోజు బీసీ వర్గాలు అధికారంలో భాగం అందుకుంటున్నాయంటే అది ఎన్టీఆర్ తెచ్చిన రాజకీయ విప్లవ ఫలితం. నిజాం నాటి బానిస భావజాలం నుంచి బయటపడ్డారంటే దానికి ఎన్టీఆర్ చేసిన పాలనా సంస్కరణలే కారణం. తెలుగు ప్రజలకు ఈ రోజు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందంటే దానికి ఎన్టీఆర్ వేసిన పునాదులే కారణం. తెలుగువాళ్లు అంటే మద్రాసీలే అనుకునే పరిస్థితి నుంచి .. తెలుగు వారంటే తెలుగు వారు అనుకునే గుర్తింపును తెచ్చి పెట్టారు. పేద పిల్లలు పాలపిండితో.. పేదలు జొన్న అన్నం తినాల్సిన రోజుల్లో అందరికీ బియ్యం అందించిన సంక్షేమం ఆయనది.
తెలుగుకు ఉన్న సంస్కృతిక వైభవం ఇప్పటికీ భావితరాలకు అందుతోందంటే దానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు. ఆయన ఘనమైన వారసత్వం కొనసాగిస్తే.. తెలుగు ప్రజల గుర్తింపు అలాగే కొనసాగుతోంది. మారుతున్న రాజకీయాల్లో ద్వేషం నింపడమే ఓ వ్యూహంగా మారిపోయిన పరిస్థితుల్లో ఎన్టీఆర్ నూ వదలడం లేదు. కులం, మతం, ప్రాంతం పేరుతో ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపిస్తే.. అది మన మూలాల్ని మనం అవమానించుకున్నట్లే.
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగ ఆయనకు తెలుగు360 నివాళి.