త్రివిక్రమ్ ప్రతిభపై తొలిసారి సందేహాలు రేకెత్తించిన చిత్రం అజ్ఙాతవాసి. పవన్ కల్యాణ్‌తో చేసిన ఈ చిత్రం డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది. ‘త్రివిక్రమ్ ఇలా తీశాడేంటి’ అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ బెంగ ఎన్టీఆర్ అభిమానులకూ పట్టుకుంది. ఎందుకంటే… అప్పటికే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిక్సయ్యింది. అజ్ఞాతవాసి ఎఫెక్ట్ ‘అరవింద సమేత’పై పడుతుందేమో అని భయపడ్డారు. మరి ఎన్టీఆర్‌కీ అలాంటి అనుమానాలున్నాయా? ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ ఒత్తిడి త్రివిక్రమ్‌పై పడిందని అనుకుంటున్నాడా? ఈ సందేహాలకు సమాధానాలు ఇచ్చేశాడు ఎన్టీఆర్. శనివారం హైదరాబాద్ లో ఎన్టీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో ‘అజ్ఞాతవాసి’ ప్రస్తావన వచ్చింది.
”అజ్ఞాతవాసి ప్రభావం త్రివిక్రమ్‌పై ఉంటుందని నేను అనుకోను. సినిమాలనేవి ఓ ప్రయాణం. అందులో హిట్స్ ఉండొచ్చు, ఫ్లాప్స్ ఉండొచ్చు. నాకు లేవా ఫ్లాపులు…?? ఒత్తిడి అనేది త్రివిక్రమ్‌గారిపైనే కాదు.. అందరిపైనా ఉంటాయి. కానీ ఓ సినిమా ఆ స్థాయిలో ప్రభావితం చేస్తుందని నేను భావించను. ‘అరవింద సమేత’ అనే పూర్తిగా త్రివిక్రమ్ సినిమా. ఆయన ప్రయాణంలో నేను భాగమయ్యానంతే. అంతేగానీ నా ప్రయాణంలో త్రివిక్రమ్ భాగం కాదు. `అరవింద`లో అన్ని పాత్రల్నీ చాలా అద్భుతంగా రాశారాయన” అంటూ కితాబిచ్చాడు ఎన్టీఆర్.