‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన కామెంట్ ఇది. నిజమే. మధ్యలో ట్రిపుల్ ఆర్ని మినహాయిస్తే ఎన్టీఆర్ సోలోగా సినిమా చేసి ఆరేళ్లయ్యింది. ఓ స్టార్.. అది కూడా ఎన్టీఆర్ లాంటి మాస్ స్టార్, కమర్షియల్ రేంజ్ ఉన్న హీరో.. ఓ సినిమా చేయడానికి ఇంతింత సమయం తీసుకోవడం నిజంగా చిత్రసీమకు మంచిది కాదు. అభిమానులకూ ఇబ్బంది కరమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో యేడాదికి ఒక సినిమా చేయాలనుకోవడం అత్యాసే. అయితే కనీసం రెండేళ్లకు ఓ సినిమా ఆశించడం తప్పు కాదు. అంతకంటే ఎక్కువ సమయం తీసుకొంటే మాత్రం చిత్రసీమకు హీరోలు అన్యాయం చేసినట్టే అవుతుంది. సినిమా సినిమా మధ్యలో గ్యాప్ రావడం ఎన్టీఆర్ మనసునీ కష్టపెడుతోంది. ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తీసినా వేగంగా సినిమాలు చేయడం లేదన్న బాధ ఎన్టీఆర్ లోనూ ఉంది. అందుకే ఇలాంటి కామెంట్ చేయాల్సివచ్చిందేమో అనిపిస్తోంది.
రాజమౌళితో సినిమా అంటే.. కచ్చితంగా రెండు మూడేళ్లు మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే అవకాశం ఉండదు. ట్రిపుల్ ఆర్ విషయంలో అదే జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తదుపరి సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఆ ఒత్తిడి వల్ల అతి జాగ్రత్తకు పోవాల్సి ఉంటుంది. అందుకే ‘దేవర’ ప్రాజెక్ట్ లేట్ అయ్యింది. మధ్యలో ఈ సినిమాని రెండు భాగాలుగా చేయాలన్న నిర్ణయం వల్ల కూడా ప్రాజెక్ట్ ఆలస్యమైంది. కాకపోతే… ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ చాలా బలంగా ఉంది. ‘వార్ 2’లో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాకి ఇటీవలే క్లాప్ కొట్టారు. రాబోయే మూడేళ్లలో ఎన్టీఆర్ నుంచి రెండు సినిమాలొస్తాయి. కాబట్టి, ఇప్పటి వరకూ ఉన్న లోటుని ఎన్టీఆర్ భర్తీ చేసినట్టే అనుకోవాలి. ఇక మీదట చేయబోయే సినిమాలు మాత్రం లేట్ కాకుండా చూసుకొంటే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతారు. పరిశ్రమకూ మంచిది.