‘అరవింద సమేత వీర రాఘవ’ కోసం ఎన్టీఆర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ‘టెంపర్’ తరవాత తొలిసారి మళ్లీ చొక్కా విప్పి తన సిక్స్ ప్యాక్ కూడా చూపించాడు. ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ అభిమానుల్ని మెప్పిస్తే… కొంతమంది మాత్రం ‘ఇది ఆర్టిఫిషియల్ బాడీ’ అన్నట్టు మాట్లాడారు. గ్రాఫిక్స్ అంటూ తేలిగ్గా చూశారు. నిజానికి ఈ సిక్స్ ప్యాక్ కోసం ఎన్టీఆర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. పదకొండు రోజుల పాటు.. కేవలం నీళ్లనే ఆహారంగా తీసుకున్నాడు ఎన్టీఆర్. ఈ కష్టం గురించి ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావిస్తే…
”సిక్స్‌ప్యాక్ కోసం అందరూ పడే కష్టమే నేనూ పడ్డాను. అదేం ప్రత్యేకం కాదు. ‘జై లవకుశ’కు బాగా లవయ్యా. ‘మీరు కొంచెం ఫిట్ గా ఉండాలి’ అని త్రివిక్రమ్ అడిగారు. నేను దాన్ని సీరియస్‌గా తీసుకుని.. బాడీని అదుపులోకి తెచ్చుకున్నా. దానికి తగ్గట్టు నాకు మంచి ట్రైనర్ దొరికాడు. ఏం చేయాలో, ఏం చేయకూడదో తనకు బాగా తెలుసు. అందుకే అనుకున్న సమయానికి బాడీని ఓ షేప్‌లోకి తీసుకురాగలిగా. సిక్స్ ప్యాక్ అన్నది సినిమా కోసమో, ఫైట్ కోసమో కాదు. బాడీ ఫిట్ గా ఉండడం మన ఆరోగ్యానికీ మంచిది కదా? అదో ప్రోసెస్. నన్ను చూసి మా ఆవిడ కూడా స్ఫూర్తి తెచ్చుకుంది. డెలివరీ సమయంలో తను చాలా లావయ్యింది. నువ్వు తగ్గావు కదా, నేను కూడా తగ్గి చూపిస్తా అంటోంది” అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.