‘అరవింద సమేత వీర రాఘవ’ ఇంటర్వ్యూల కోసం ఈరోజు ప్రింట్ మీడియాముందుకొచ్చాడు ఎన్టీఆర్. సినిమా విషయాలతోపాటు, వ్యక్తిగతమైన సంగతుల్నీ పంచుకున్నాడు. అన్ని విషయాలపై మనసు విప్పి మాట్లాడిన తారక్… రాజమౌళి సినిమా గురించి అడిగేసరికి సమాధానం దాటేశాడు. ఎన్ని ప్రశ్నలు సంధించినా, అటు తిప్పి ఇటు తిప్పి అడిగినా `రాజమౌళి సినిమా గురించి మాత్రం అడక్కండి..` అనే సమాధానమే వినిపించాడు. ”రాజమౌళి సినిమా గురించి ఏ విషయమైనా ఆయన చెబితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా రాజమౌళి మార్క్ చిత్రం” అనేశాడు తారక్. ”రామ్‌చరణ్ తో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇద్దరం మంచి మిత్రులం. అన్నింటికంటే మించి ఈ సినిమాతో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాం. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది రాజమౌళినే చెప్పాలి” అన్నాడు ఎన్టీఆర్. మిగిలిన కథానాయకులతో మల్టీస్టారర్ ఎప్పుడు? అని అడిగితే “అందరితోనూ కలసి పనిచేయాలనివుంది. మేమంతా రెడీనే. అయితే… మా హీరోల్ని నడిపించగలిగే కెప్టెన్ దొరకాలి. రాజమౌళి అందుకు సమర్థుడు కాబట్టే.. రామ్‌చరణ్ సినిమా మొదలవ్వబోతోంది” అని చెప్పుకొచ్చాడు. వర్కింగ్ టైటిల్‌గా ‘ఆర్.ఆర్.ఆర్’ బాగా పాపులర్ అయ్యింది. టైటిల్ కూడా ఇలానే ఉంటుందా? అని అడిగితే “అలా మాత్రం ఉండదు. కథకు ఏది అవసరమో అదే పెడతారు” అని ముక్తాయించాడు ఎన్టీఆర్.