కేంద్రమంత్రి అమిత్ షాకు అర్జంట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమానం, ప్రేమ పొంగుకొచ్చాయి. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాని చూశారు. ఆ సినిమాకు పని చేసిన వారిలో ఇప్పటికే కథా రచయితను ఇప్పటికే గుర్తించి రాజ్యసభ సీటిచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను విందుకు పిలిచారు. తాను హైదరాబాద్ వస్తున్న సమయంలో తనతో పాటు డిన్నర్ చేయాలని ఆహ్వానించారు. ఇలాంటి ఆహ్వానాలను.. అది కూడా అమిత్ షా నుంచి వస్తే.. “నేను రాను” అని తిరస్కరించే ధైర్యం ప్రస్తుతానికి ఎవరికీ లేదు. అందుకే ఎన్టీఆర్ వెళ్లక తప్పలేదు.
ప్రత్యేకంగా ఇరవై నిమిషాల పర్సనల్ భేటీతో గుసగుసలు !
ఎన్టీఆర్, అమిత్ షాల డిన్నర్ భేటీ దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు సాగింది. ఇందులో ఇరవై ఐదు నిమిషాల పాటు అందరూ కలిసి డిన్నర్ చేశారు. ఈ డిన్నర్ భేటీలో కిషన్ రెడ్డి ఇతర ప్రముఖులు ఉన్నారు. కానీ తర్వాత అమిత్ షా.. ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా ఇరవై నిమిషాలు మాట్లాడారు. ఏం మాట్లాడారన్నది వారు చెబితే తప్ప బయటకు తెలియదు. ఇందులో రాజకీయాలు ఉన్నాయని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్‌కు రాజకీయ నేపధ్యం ఉంది. అంతకు మించి ఛరిష్మా ఉంది. ఆర్ఆర్ఆర్లో తెలంగాణ పోరాట యోధుడు కొమురంభీం పాత్ర పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. అయితే అసలు లక్ష్యం మాత్రం ఇలా గుసగుసలు వచ్చేలా చేయడమేనన్నది ఎక్కువ మంది నమ్ముతున్నమాట.
ఎన్టీఆర్పైనే ఊహాగానాలు..బీజేపీకి ప్లస్సే !
అమిత్ షా, ఎన్టీఆర్ భేటీతో ఎవరికి నష్టం.. ఎవరి లాభం అనే అంశాలను పక్కన పెడితే.. ప్రస్తుతం ఎక్కువగా అడ్వాంటేజ్ బీజేపీకే వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి స్టార్ ను అమిత్ షా అమితంగా గౌరవిస్తే ఆయన అభిమానులు ఫిదా అవుతారు. బీజేపీ విషయంలో పాజిటివ్‌గా ఉండొచ్చు. ఈ విషయంలో బీజేపీ స్కోర్ చేసింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి రాజకీయాల్లో లేరు. ఇప్పుడల్లా రావాలని అనుకోవడం లేదు. రాజకీయాలై దృష్టి పెట్టడం వల్ల సినిమా కెరీర్ దెబ్బతింటోందని ఆయన అనుకుంటున్నారు. అదే సమయంలో కుటుంబపరమైన వివాదాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ కి పాజిటివ్‌గా చర్చ జరుగుతోంది కానీ ఎన్టీఆర్‌పై నెగెటివ్ ఊహాగానాలు జరగడానికి అవకాశం ఏర్పడింది.
బీజేపీ టార్గెట్ చేసింది ఏపీ రాజకీయాల్నా ? తెలంగాణ రాజకీయాల్నా ?
అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ తర్వాత ఎక్కువ మంతి తెలంగాణ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి ఓ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి.. టీడీపీకి తాము దూరంగా లేమని చెప్పడానికి ఈ భేటీ నిర్వహించారని అనుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ “రాజకీయ ప్రభావం” ఎలా చూసినా.. తెలంగాణలో తక్కువ. ఏపీలోనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎపీలో ఈ అంశంపై ఎలాంటి చర్చలు జరుగుతాయన్నది కీలకం. అయితే అమిత్ షా .. ఎన్టీఆర్‌ను ఉత్తినే సినిమా చూసి .. భోజనానికి ఆహ్వానించారని ఎవరూ అనుకోవడం లేదు. ఖచ్చితంగా రాజకీయం ఉంది. అదేమిటన్నది.. వారికే తెలుసు.
కారణం ఏదైనా.. భేటీ వల్ల ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌పై రకరకాల చర్చలకు కారణం అవుతోంది. కానీ బీజేపీ మాత్రం ఈ పొలిటికల్ సర్కస్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితిని జూనియర్ కూడా ఎవాయిడ్ చేయలేరు. కానీ ఎదుర్కోగల క్లారిటీ ఆయనకు ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.