అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణంపై ఎన్టీఆర్కు కృష్ణకు విభేదాలు వచ్చాయన్నది పరిశ్రమలోనే గాక బయిట కూడా తెలిసిన విషయమే. అయినా కృష్ణ ధైర్యంగా భారీగా ఆ చిత్రం తీసి చరిత్ర సృష్టించడం ఆయన పేరు చెబితేనే గుర్తుకు వచ్చేలా ఆ చిత్రం నిలిచిపోవడం వాస్తవం. ఇంతకూ ఆ విభేదం ఏమిటనే విషయమై కృష్ణ సోదరుడు నిర్మాత జి.ఆదిశేషగిరి రావు నాకిచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆసక్తికరంగా వున్నాయి. జయసింహ చిత్రం పాటల పుస్తకంలో ఎన్టీఆర్ మా రాబోవు చిత్రం అల్లూరి సీతారామరాజు అని ప్రకటించారు. కొన్ని పాటలు కూడా రికార్డు చేశారు(వాటిని నేను విన్నాను కూడా) అయితే తర్వాత రెండు దశాబ్దాలు గడిచినా చిత్ర నిర్మాణం చేయలేదు. దేవుడు చేసిన మనుషులు విజయం తర్వాత కృష్ణ అల్లూరి చిత్రం తీస్తున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ మరో సోదరుడైన జి.హనుమంతరావును పిలిపించారట. ఆ చిత్రం నేను తీయాలనుకున్నాను అని చెబితే మీరు తీస్తే మేము మానేస్తాము అని ఈయన బదులిచ్చారట. లేదు ఆ చిత్ర కథలో అంత పట్టులేదు అందుకే తీయడం లేదు అని ఎన్టీఆర్ చెప్పగా మా కథ బావుంది మీరు తీయకపోతే మేము తీస్తాము అని హనుమంతరావు అన్నారట. లేదు మీకు పిల్లలు సంసారం వున్నాయి. ఈ దశలోనే అలాటి చిత్రం తీసి రిస్కు పెట్టుకోవద్దు అని ఎన్టీఆర్ సలహా ఇచ్చారట. మా కథ మీద మాకు నమ్మకం వుంది అని వీరు మళ్లీ చెబుతూ ముందుకు సాగారట. ఆయన దగ్గర మంచి కథ లేదు, మా కథ బాగుంది అని ఆదిశేషగిరిరావు అన్నారు. అయితే ఆ చిత్రం లో కృష్ణను ఆ పాత్రలో చూశాక మరో ఏడాది ఇంకే చిత్రం ఆడదు అని చక్రపాణి అన్నమాట మాత్రం నిజమైందని మళ్లీ తమ పాడిపంటలు వరకూ ఏదీ సరిగ్గా ఆడలేదని ఆయన గుర్తు చేశారు. మొత్తంపైన నేను తీయను, మీరు తీయొద్దు అన్న ఆ సలహా పాటించి వుంటే తెలుగు చిత్ర సీమకు ఒక గొప్ప చిత్రం తప్పిపోయేది కదాఔ