ఏ రంగంలో ఉన్నవాళ్లకైనా క్రమశిక్షణ చాలా అవసరం. అది తప్పితే… తగిన ఫలితాల్ని, పరిణామాల్నీ అనుభవించాల్సివుంటుంది. సినిమా రంగంలో క్రమశిక్షణ ఉండదు అనుకుంటారు కానీ, అది నూటికి నూరుపాళ్లూ సరైనది కాదు. ముఖ్యంగా స్టార్ హీరోలెప్పుడూ క్రమశిక్షణతోనే మెలిగారు. బహుశా అదే వాళ్ల విజయ రహస్యం కూడా కావొచ్చు. అల్లాటప్పాగా ఎదిగి, స్టార్లయిపోయినవాళ్లు చాలా అరుదు. అలా ఎదిగినా వాళ్ల మెరుపులు కొద్దికాలమే. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలు ఎప్పుడూ క్రమశిక్షణ కోల్పోలేదు. తమ ముందు ఎవరు తోక జాడించినా చూస్తూ ఊరుకోలేదు. తమదైన స్టైల్ లో శిక్ష విధించారు. దారితోకి తెచ్చారు. అందుకో మేలిమి ఉదాహరణ ఇది.
1958 నాటి ఫ్లాష్ బ్యాక్ ఇది. ‘భూకైలాస్’ చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, జమునలపై ఓ కీలకమైన సన్నివేశం తెరకెక్కించాలి. సముద్రం నేపథ్యంలో సన్నివేశం. ఔడ్డోర్ తప్పనిసరి. ఆ రోజుల్లో అవుడ్డోర్ అంటే.. ఉదయం ఏడింటికల్లా షూటింగ్ మొదలవ్వాలి. సహజమైన లైటింగ్‌లోనే షూట్ చేసేవారు. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్‌పై సోలో షాట్స్ తీసేశారు. మెల్లగా అక్కినేని కూడా వచ్చేశారు. కానీ జమున రాలేదు. ఏడున్నర, ఎనిమిది.. ఎనిమిదన్నర,.. తొమ్మిదిన్నర.. అయినా జమున రాలేదు. ఓ పక్క ఎండ. మరోవైపు అలసట. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా.. సన్నివేశాన్ని రిహార్సల్ చేస్తున్నారు. జమున ఎంతకీ రావడం లేదు. సరిగ్గా పదింటికి… జమున వచ్చి.. ‘నేను రెడీ’ అంటూ సెట్లోకి ప్రవేశించింది.
”అదేంటి.. ఇంతసేపు మమ్మల్ని నిరీక్షించేలా చేసి.. కనీసం క్షమాపణలు కూడా అడక్కుండా.. నేను రెడీ..అంటోందేమిటి” అనిపించింది ఎన్టీఆర్, ఏఎన్నార్లకు.
సన్నివేశం ప్రకారం ఎన్టీఆర్ శివలింగంతో తన తలని కొట్టుకుంటుండాలి.. దాన్ని ఆపడానికి దూరం నుంచి ఏఎన్నార్, జమున పరుగెట్టుకుంటూ రావాలి.
ఏఎన్నార్, జమున షాట్ తీస్తున్నారు. ‘యాక్షన్’ చెప్పగానే ఇద్దరూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ‘వన్ మోర్’ అని గట్టిగా అరుస్తున్నారు. ఏదైనా తప్పు జరిగిందేమో అని ఏఎన్నార్, జమున.. ఇద్దరూ వెనక్కి వెళ్లి… ‘యాక్షన్’ చెప్పగానే మళ్లీ పరుగందుకుంటున్నారు. కానీ… ఎన్టీఆర్ ‘వన్ మోర్’ అంటున్నారు. కనీసం ఏడెనిమిదిసార్లు రీ టేకులు జరిగాయి. ఇక పరిగెట్టలేక ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు ఏఎన్నార్.
”బ్రదర్.. మీరు జమునపై కోపంతోనే ఇలా రీటేకులు చేయిస్తున్నారని నాకు తెలుసు. నేను ఇక పరిగెట్టలేను. నా కాళ్లు సహకరించడం లేదు. ఆ బురదలో పరిగెట్టలేను” అనేసరికి తదుపరి టేక్‌ని ఎన్టీఆర్ ఓకే చేశారు.
ఆ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ ఒకే కార్లో బయల్దేరారు.
”జమున పద్ధతేం బాగోలేదు బ్రదర్. ఈరోజే కాదు.. ప్రతీసారీ తను షూటింగ్‌కి ఆలస్యంగా వస్తున్నారు. చాలామంది దర్శకులు, నిర్మాతలు ఇది వరకే జమునపై ఫిర్యాదు చేశారు. ఇక నుంచి మనమిద్దరం ఆమెతో నటించకూడదన్న నిర్ణయం తీసుకుందాం” అని ఏఎన్నార్‌తో చెప్పారు ఎన్టీఆర్
”అదేంటి బ్రదర్. తను చిన్నపిల్ల. పిలిచి మందలిద్దాం ” అని సర్దిచెప్పబోయారు.
”లేదు బ్రదర్.. క్రమశిక్షణ పాటించకపోతే.. ఇలాంటి శిక్షలు తప్పవని అందరికీ తెలియాలి..” అని ఎన్టీఆర్ అనేసరికి అక్కినేని కూడా కాదనలేకపోయారు. చివరికి ఎన్టీఆర్, ఏఎన్నార్.. జమునతో నటించమని నిర్మాతలకు చెప్పేశారు. అలా.. వీరిద్దరి సినిమాలకూ జమున దూరమయ్యారు. చివరికి.. చాలా కాలానికి ‘గుండమ్మ కథ’ సినిమాలో ఏఎన్నార్ కి జోడీగా జమునని ఎంచుకున్నారు. నిజానికి అప్పటికీ ఎన్టీఆర్‌కి జమునని తీసుకోవడం ఇష్టం లేదట. ”ఇన్నాళ్లూ మనం జమునని దూరం పెట్టాం. తన తప్పు తెలుసుకుని ఉంటుంది. మనమే పెద్ద మనసు చేసుకుని మన్నించాలి..” అని ఏఎన్నార్.. ఎన్టీఆర్‌కి సర్దిచెబితే.. ‘గుండమ్మ కథ’లో జమునకు స్థానం దక్కింది. అప్పటితో జమునకు ఈ దిగ్గజాలు విధించిన శిక్ష పూర్తయినట్టైంది. ఈ సంగుతులన్నీ అక్కినేని తన ఆత్మకథలో సవివరంగా రాసుకున్నారు కూడా.