NTR Aravinda Sametha Interview
ఎన్టీఆర్ ఓ సునామీ.
తన డైలాగులతో, మేనరిజంతో, స్టెప్పులతో… సంచలనాలు సృష్టిస్తుంటాడు.
అటు జీవితంలోనూ, ఇటు సినీ కెరీర్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కోవడం తనకి అలవాటే. పడిన ప్రతీసారీ అంతే గట్టిగా లేస్తాడు. వరుస పరాజయాలతో అల్లాడిన తారక్… ఇప్పుడు వరుస హిట్లతో జోరుమీదున్నాడు. టెంపర్‌తో తన స్థాయి, స్టామినా మారిపోయాయి. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ… ఇలా విజయపరంపర కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ‘అరవింద సమేత వీర రాఘవ’ అంటూ త్రివిక్రమ్ టచ్ ఉన్న ఓ ఫ్యాక్షన్ కథని వినిపించబోతున్నాడు. గురువారం ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో చేసిన చిట్ చాట్ ఇది.
* అరవింద సమేత వీర రాఘవ.. ఈ టైటిల్ ఏదో కాస్త పొడుగ్గా ఉందే..
– టైటిలే కాదు.. కథ, కథనాలు కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. త్రివిక్రమ్ టైటిల్ చెప్పగానే నచ్చేసింది. ప్రత్యేకంగా అనిపించింది. మరో టైటిల్ గురించి అస్సలు ఆలోచించలేదు. మనం గుడికి వెళ్తే `సీతా సమేత శ్రీరాములు`, `లక్ష్మీ సమేత నరసింహులు` అనే పేర్లు చూస్తుంటాం. దేవుళ్లకే ఆడవాళ్ల పేర్లు అలంకారాలయ్యాయి. మనమెంత..?
* త్రివిక్రమ్‌తో పన్నెండేళ్ల అనుబంధం మీది. మరి సినిమా చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది?
– ఫోర్స్‌గా చేయడం నాకూ, త్రివిక్రమ్‌కీ నచ్చదు. మా ఇద్దరిలో ఉన్న ఉమ్మడి లక్షణం ఇది. రచయితగా ఉన్నప్పటి నుంచే ఆయన తెలుసు. దర్శకుడి కంటే నాకు మంచి స్నేహితుడు. కానీ తనతో కలసి పని చేసే అవకాశం ఇప్పుడొచ్చింది. నేను త్రివిక్రమ్ ప్రయాణంలో ఓ భాగమవ్వాలనుకున్నా. అంతే గానీ నా ఇమేజ్‌కి సరితూగే కథ చెప్పమని అడగలేదు. ఆయన ఆలోచనలకు పాత్రధారులంతా కలిసి ఓ రూపం ఇచ్చామంతే.
* ట్రైలర్ చూస్తుంటే ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన గత చిత్రాలు గుర్తొస్తున్నాయి?
– ఫ్యాక్షన్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. ఆ సినిమాల్లో ఫ్యాక్షన్‌కి తమదైన కోణంలో ఓ పరిష్కారం చెప్పే ప్రయత్నం చేశారు. ఇది మరో పరిష్కారం. ఆడవాళ్ల విలువ గురించీ, వాళ్ల ప్రాధాన్యం గురించీ చెప్పిన సినిమా ఇది. వాళ్లందరికీ తప్పకుండా నచ్చుతుంది.
* హీరోయిజం చూపించాలంటే హింసని చూపించాల్సిందేనా?
– నవరసాల్లో రౌద్రం ఒకటి. దాన్ని అలానే చూడాలి. ఈ సినిమాలో యాక్షన్ అనేది ఒక్క పొర మాత్రమే. త్రివిక్రమ్ మార్క్ సన్నివేశాలన్నీ ఉంటాయి.
* పాటలు తక్కువ ఉన్నాయని, డాన్స్ నెంబర్లు కావాలని ఫ్యాన్స్ కాస్త అలిగినట్టున్నారు?
– అదే నాకూ అర్థం కావడం లేదండీ. డాన్స్ నటనలో భాగం తప్ప… డాన్స్ లో భాగం నటన కాదు… అని ప్రి రిలీజ్ ఫంక్షన్లో చెప్పింది అందుకే. కథకి అనుగుణమైన పాటలు ఇవ్వాలి తప్ప, పాటల కోసం పాటలు ఇవ్వకూడదు. గతంలో పాటలు కథలో భాగంగా వచ్చేవి. ఆ తరవాత… పాటలు కమర్షియల్ అంశాలైపోయాయి. ఇప్పుడు కథలోంచి పాటలు పుట్టుకొస్తున్నాయి. పాటని ఓ ఐటెమ్ నెంబర్‌గా చూడడం తగ్గుతోంది.
`పెనిమిటీ` అనే పాట నాకెంతో నచ్చింది. ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ బయటపెట్టే పాట ఇది. నాకు డాన్సులు చేసే పాటలు కావాలి అని చెబితే ఆ పాట మిస్సయ్యేవాడ్ని.
* మీరు ప్రయోగాలు చేసినప్పుడల్లా `ఇంకేదో కావాలి` అని అభిమానులు ఆశిస్తుంటారు. అభిమానుల అంచనాలు మిమ్మల్ని ఓ ఛట్రంలో బంధిస్తున్నాయా?
– వాళ్లు కావాలనుకున్న ఇంకేదో అన్నదేమిటో ఇప్పటి వరకూ నాకు అర్థం కాలేదు. పది ఫైట్లు ఉంటేనే అది ఎన్టీఆర్ సినిమా అవుతుందా? అసలు `టిపికల్ ఎన్టీఆర్ సినిమా అంటే ఏమిటి` అనేది నాకు తెలియడం లేదు. నాకో షాకింగ్ ఎక్స్ పీరియన్స్ కావాలి. `ఇలాంటి సినిమా ఎన్టీఆర్ చేయగలడా` అని అనుకోవాలి. అలాంటి కథల కోసమే నా ప్రయత్నం.
* ఓ మంచి పాత్ర వస్తే సంతోషిస్తారా? ఓ మంచి సినిమా దక్కితే ఆనందిస్తారా?
– మంచి పాత్ర దక్కి, ఆ సినిమా బాగా హిట్టయితే ఇంకా ఆనందిస్తా
* ఈ సినిమా కోసం రాయలసీమ యాసలోనూ మాట్లాడినట్టున్నారు..
– అవును.. ఇది కూడా త్రివిక్రమ్ ఆలోచనే. రాయలసీమ యాస నాకు బాగా ఇష్టం. అందులో ఏంటి? అనే పదం ఉండదు. యాంది అని అంటారు. నాకెందుకో తెలంగాణ భాష లక్షణాలు కొన్ని రాయలసీమ యాసలో కనిపిస్తాయి. పెంచెలదాస్ ఇచ్చిన సహకారంతో రాయలసీమ డైలాగులు నేర్చుకున్నా.
* ఈ సినిమాతోనూ, పెనిమిటీ పాటతోనూ పర్సనల్‌గా కనెక్ట్ అయినట్టున్నారు?
– అవునండీ. ఈ సినిమా నాకు వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయిపోయింది. ఈమధ్య మా ఇంట్లో ఓ దారుణం జరిగింది. యాదృచ్చికంగా సినిమాలోనూ అలాంటి సన్నివేశాలున్నాయి. నాన్న చితికి నిప్పంటించిన సన్నివేశం ఇప్పటి వరకూ చేయలేదు. కానీ..`అరవింద`లో అలాంటి సీన్ ఒకటుంది. పెనిమిటీ పాట వింటే మా అమ్మ, పెద్దమ్మ గుర్తొచ్చారు. రికార్డింగ్ అయిన నాలుగు నెలలకు ఈ పాట విన్నా. వినగానే కదిలిపోయా. అమ్మ కూడా ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది.
* త్రివిక్రమ్‌తో కూడా ఎటాచ్మెంట్ బాగా పెరిగినట్టుంది?
– నేను పనిచేసిన దర్శకులందరినీ నేను ఒకేలా ప్రేమిస్తా. త్రివిక్రమ్ మరింత దగ్గరైపోయాడు. దర్శకుడు – హీరో అనేవాళ్లు భార్యా భర్తల్లా ఉండాలన్నది నా ఉద్దేశం. త్రివిక్రమ్ నాకు స్నేహితుడు, దార్శనికుడు.. అన్నీ.
* పుస్తకాలేమైనా పరిచయం చేశారా?
– లేదండీ. నేను పెద్దగా చదవను. వింటానంతే. ఆయన పుస్తకాల గురించి చెబుతూ ఉంటే, నేను వింటూ ఉండేవాడ్ని.
* బిగ్ బాస్‌ని మిస్ అయ్యారా?
– అలా అనుకోవడం లేదు. నా సినిమాలు, పిల్లలతోనే సమయం గడిచిపోయింది. సమయాభావం వల్ల బిగ్ బాస్ లో ఏం జరిగిందో కూడా ఫాలో అవ్వలేకపోయా.
* బిగ్ బాస్ 3లో మిమ్మల్ని చూడొచ్చా?
– ఇంకా ఏమీ అనుకోలేదు. నేనేదీ ప్లాన్ చేసుకోను. ఏం అనిపిస్తే అది చేయడమే. చూద్దాం ఏం జరుగుతుందో..??