ఎన్టీఆర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్… ఇలా వరుస విజయాలతో దూకుడుమీదున్నాడు. జనతాగ్యారేజ్ తరవాత కచ్చితంగా చాలా పెద్ద దర్శకుడితోనే సినిమా చేస్తాడనుకొన్నారంతా. కానీ అనూహ్యంగా బాబికి అవకాశం దక్కింది. సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి ఫ్లాప్ ఇచ్చినా, బాబిని కావాలని ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. ఎన్టీఆర్ బాగా కన్ఫ్యూజ్ అయిపోయి, ఈనిర్ణయం తీసుకొన్నాడేమో అనిపించింది. అయితే… బాబిని దర్శకుడిగా ఎంచుకోవడానికి అసలు రీజన్ చెప్పాడు ఎన్టీఆర్. ఆదివారం హైదరాబాద్‌లో జై లవకుశ పాటలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ బాబి విషయంలో క్లారిటీ ఇచ్చాడు.
”జనతా గ్యారేజ్ తరవాత నేను చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాలేదు. మనసుకి నచ్చిన సినిమా చేయాలా, లేదంటే ట్రెండ్ ఫాలో అయిపోవాలో అర్థం కాలేదు. ఈ దశలో బాబి నాకు ఈ కథ వినిపించాడు. కథ వినగానే.. మనసుకు నచ్చిన ఇలాంటి సినిమానే చేయాలనిపించింది. నా కెరీర్లో నేను చేసిన ది బెస్ట్ స్క్రిప్ట్ ‘జై లవకుశ’. మూడు పాత్రల్లో నటించే అవకాశం ఓ నటుడికి అరుదుగా దక్కుతుంది. ఈ సినిమాని కేవలం ఓ సినిమా చూడడం లేదు. మా నాన్నకు షష్టి పూర్తి కానుక ఇవ్వాలనుకొన్నాం. మా అన్నదమ్ములిద్దరూ ఇస్తున్న కానుక ఇదే. ఈనెల 2వ తారీఖున ఈ సినిమాని విడుదల చేద్దామనుకొన్నాం. 2 అయితే ఏంటి? 21 అయితే ఏంటి? మా అమ్మానాన్నలు, మా పిల్లలు గర్వపడే సినిమా తీస్తే చాలు. అది ఇదే..” అంటూ ‘జై లవకుశ’ గురించి చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.