బిగ్ బాస్ షో.. తొలి ఎపిసోడ్ పూర్తయ్యింది. అప్పుడే.. విశ్లేషణలు మొదలైపోయాయి. ఎన్టీఆర్ ఎలా చేశాడు? సెలబ్రెటీలు ఎలా ఉన్నారు? అసలు వాళ్లు సెలబ్రెటీలేనా..? ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందా? అంటూ ఎన్నెన్నో ప్రశ్నలు.. వాటికి సమాధానాలు వినిపిస్తున్నాయి. తొలి సీన్‌కే… సినిమా రిపోర్ట్ చెప్పేయడం ఏమిటి? కనీసం ఇంట్రవెల్ వరకైనా ఆగాలి కదా?! అయినా ఇప్పుడే బిగ్ బాస్ షో మొదలైంది. అప్పుడే పోస్ట్ మార్టమ్ ఎందుకు..? తొలి ఎపిసోడ్లో సెలబ్రెటీలను పరిచయం చేశారంతే. గేమ్.. ఇంకా మొదలవ్వలేదు. అప్పుడే తీర్పులెందుకు?
ఎపిసోడ్‌ని ఎపిసోడ్లానే చూస్తే… అందరినీ ఆకట్టుకొన్న అంశం ఎన్టీఆర్ వ్యాఖ్యానం. వెండి తెరపై ఎన్టీఆర్ విధ్వంసకరమైన నటుడే అవ్వొచ్చు. కానీ బుల్లి తెర బొత్తిగా కొత్త. హేమా హేమీలైన నటులే.. బుల్లి తెరపై రాణించలేకపోయారు. అలాంటిది ఎన్టీఆర్ తొలి షోనే రక్తికట్టించగలిగాడు. ఇక్కడ స్క్రిప్ట్ అంటూ ఏమీ ఉండదు. స్పాంటెనిస్గా మాట్లాడేయడమే. ఎన్టీఆర్ అదే చేశాడు. అతని నవ్వు… మాట.. పలకరింపు ఇంకా స్వచ్ఛంగానే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల.. కాస్త బిగుసుకుపోయినట్టు అనిపిస్తున్నా… అది తొలి షో తాలుకూ బిడియమే అనుకొని వదిలేయొచ్చు. సెలబ్రెటీలపైనా విమర్శలు వస్తున్నాయి. అసలు వీళ్లు బిగ్ బాస్‌కి కళ తెస్తారా?? అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు కొంతమంది. నిజానికి ఏ బిగ్ బాస్ షోలోనూ… స్టార్ సెలబ్రెటీలు కనిపించరు. 70 రోజుల పాట ఇంటికి, సినిమాలకు, మీడియాకు దూరంగా ఉండే సాహసం చేయడానికి కాస్త భయపడతారు. అందుకే సెకండ్ గ్రేడ్ సెలబ్రెటీలతోనే షోలు నిర్వహిస్తుంటారు. ఇక్కడా అదే జరుగుతోంది. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకు కావల్సింది కావల్సినంత డ్రామా. ఆ షోని నడిపించే వాడు స్టార్ అయితే చాలు. ఎన్టీఆర్ రూపంలో ఆ స్టార్ దొరికేశాడు. ఇక డ్రామా పండాల్సివుంది. మొత్తానికి తొలి షోలో అన్ని మార్కులూ ఎన్టీఆర్కే పడ్డాయి. షోని ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా తనే తీసుకోవాల్సివుంది.