‘ఎన్టీఆర్’ బయోపిక్ పాటల హంగామా మొదలైపోతోంది. ఆదివారం ఉదయం తొలి గీతాన్ని చిత్రబృందం విడుదల చేస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీత సారధ్యం వహిస్తున్నారు. తొలిపాటని కీరవాణి తండ్రి శివశక్తి దత్తా రాశారు. కైలాష్ ఖేర్ ఆలపించారు. వారానికి ఒక పాటని విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. రెండు భాగాలూ కలిపి మొత్తం 11 పాటలున్నట్టు తెలిసింది. వాటితో పాటు 4 బిట్ సాంగ్స్ కీ చోటిచ్చారని సమాచారం. ఈ బిట్ సాంగ్స్ ఆర్.ఆర్లో భాగంగా వస్తాయి. వాటి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని టాక్. శివశక్తిదత్తా, సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి ఈ పాటల్ని రచించారు. ఎన్టీఆర్ పాత సినిమాల్లోని పాటల్ని అక్కడక్కడ బిట్ సాంగ్స్గా వాడిన సంగతి తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే… ఎన్టీఆర్ బయోపిక్ సంగీతాభిమానుల్ని అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కీరవాణి తన పాటల ప్రతాపం చూపించి చాలాకాలమైంది. రాజమౌళి సినిమాల్లో మినహాయిస్తే.. బయటివారి చిత్రాలకు ఆయన గొప్ప పాటలు ఇవ్వలేరన్న విమర్శ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చిత్రానికి ఎలాంటి పాటలిచ్చారన్నది ఆసక్తికరంగా మారింది.