ఎన్టీఆర్ బయోపిక్‌లో నందమూరి బాలకృష్ణని దాదాపు 70 గెటప్పుల్లో చూడబోతున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ క్లాసిక్ సినిమాల్లోని పాత్రల్ని బాలయ్య ఇందులో మళ్లీ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే గుండమ్మ కథ సినిమాకి సంబంధించిన స్టిల్ కూడా బయటకు వచ్చింది. ఆకు చాటు పిందె తడిసె.. అంటూ పాత పాటని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. అల్లూరి సీతారామరాజుగా బాలకృష్ణ కనిపించబోతున్నాడని సమాచారం అందుతోంది. ఇప్పుడు బొబ్బిలిపులిగానూ బాలయ్య మారాడు.
దాసరి దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి పులి.. ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రాల్లో స్థానం దక్కించుకుంది. సినిమా అంతా ఒక ఎత్తు.. కోర్టులో ఎన్టీఆర్ పలికే సంభాషణలు మరో ఎత్తు. ‘కోర్టు కోర్టుకీ, తీర్పు తీర్పుకీ ఇంత మార్పా’ అంటూ న్యాయ వ్యవస్థని ఎన్టీఆర్ ప్రశ్నించిన తీరు.. థియేటర్లని దద్దరిల్లేలా చేసింది. ఆ సీన్ ఇప్పుడు ‘ఎన్టీఆర్’లోనూ ఉంది. బొబ్బిలిపులి కోసం ఎన్టీఆర్ కోర్టుసీన్లో ఎలా విజృంభించారో.. ఇప్పుడు బాలయ్య కూడా న్యాయ స్థానంలో అలానే తన ప్రతాపం చూపించారు. దాసరి రాసిన సుదీర్ఘమైన సంభాషణని ఎన్టీఆర్ అప్పట్లో సింగిల్ టేక్‌లో ఓకే చేశారు. ఆ సంగతి ఇప్పటికీ నందమూరి అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు బాలయ్య కూడా అదే ఫీట్ రిపీట్ చేశార్ట. కోర్టులో సుదీర్ఘమైన డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చేసేశాడట. ఈ డైలాగ్‌కి ముందు ఏం జరిగింది? ‘బొబ్బిలి పులి’ షూటింగులో జరిగిన ఆసక్తికరమైన విశేషాల్ని ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది. కోర్టు సన్నివేశం కంటే.. తెర వెనుక జరిగిన ఆ సంగతులు మరింత ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం.